కొవిడ్ పై ప్రధాని మోడీ శుక్రవారం ముఖ్యమంత్రులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశం హాట్ హాట్ గా సాగింది. వర్చువల్ గా సాగిన ఈ సమావేశంలో పలువురు ముఖ్యమంత్రులు కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ .. కరోనా పరిస్థితులపై ప్రధాని సమక్షంలో తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రస్థాయిలో ఉందని, ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర విషాదం తప్పదని అన్నారు. తాము ఈ పరిస్థితులను ఇంకెవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎంలతో సమావేశంలో బహిరంగంగా అసహనం ప్రదర్శించారంటూ కేజ్రీవాల్ తీరు పట్ల ప్రధాని మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ వైఖరి ఆక్షేపణీయం అని, ప్రోటోకాల్ కు విరుద్ధమని పేర్కొన్నారు. సమావేశ సంప్రదాయం ఇది కాదని స్పష్టం చేశారు. దీనిపై కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. తన మాటల పట్ల చింతిస్తున్నానని, భవిష్యత్ లో ఇలా జరగకుండా చూస్తానని చెప్పారు.

కరోనా మహమ్మారి బీభత్సానికి  దేశం వణికిపోతోంది. హాస్పిటల్స్ అన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్ కొరతతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. తమ కళ్ల ముందే శ్వాస ఆడక రోగులు విలవిలలాడుతున్నా వైద్యులు ఏమి చేయలేక కన్నీళ్లు కార్చుతున్నారు. ప్రధాని సమావేశంలోనూ ఆక్సిజన్ అంశమే  ప్రధానంగా మారింది. కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉందని, పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఆక్సిజన్ కొరత చాలా ఎక్కువగా ఉందని... పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. పరిస్థితులు చేయిదాటిపోతే, మహా విషాదం తప్పదని అన్నారు. ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి, రోగి కొనఊపిరితో ఉన్నప్పుడు... ఆ పరిస్థితి గురించి తాను ఎవరితో మాట్లాడాలని సూటిగా ప్రశ్నించారు.  

కొన్ని రాష్ట్రాలు ఆక్సిజన్ రవాణా వాహనాలను ఆపేస్తున్నాయని... ఈ విషయంలో కేంద్రం రాష్ట్రాలతో మాట్లాడాలని కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని అయినప్పటికీ తాను ఏమీ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రంతా నిద్ర పట్టడం లేదని అన్నారు. ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినీ తనను క్షమించాలని కోరారు. దేశంలోని ఆక్సిజన్ ప్లాంట్లను సైన్యం స్వాధీనం చేసుకోవాలని అన్నారు. కరోనా వ్యాక్సిన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ధరకు అందజేయాలని డిమాండ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: