కరోనా మహ్మమారి విజృంభణతో భారతదేశం అల్లాడిపోతోంది. 24 గంటల్లోనే 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారత్ లోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మొత్తం కేసుల్లో భారత్ లోనే 30 శాతం ఉంటున్నాయంటే కరోనా తీవ్రత ఏ రెంజ్ లో ఉందో ఊహించవచ్చు. కరోనా రోగులతో హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి. ఆక్సిజన్ లభించక రోగులు చనిపోతున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.

కరోనా విలయతాండవం నేపథ్యంతో ఇండియాకు సహాయం చేసేందుకు పాకిస్తాన్‌లోని ఈదీ అనే సామాజిక సంస్థ స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. ఈ విషయమై దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ కూడా రాసింది. ఇండియాలో కోవిడ్ మహమ్మారి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, దీన్ని సహృదయంతో అర్థం చేసుకుని సహాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, తమకు అనుమతి ఇస్తే ఇండియాకు వచ్చి సహాయక చర్యలు ప్రారంభిస్తామని గురువారం మోదీకి రాసిన లేఖలో ఫైసల్ ఈదీ పేరుతో వచ్చిన లేఖలో రాసుకొచ్చారు.

‘‘ఇండియాకు సహాయం చేయడానికి ఈదీ ఫౌండేషన్ వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుంది. మీరు అనుమతి ఇస్తే మా పూర్తి మద్దతు ఇస్తాం. మేం చేస్తున్న సహయానికి మీ నుంచి ఎలాంటి సహాయం తిరిగి కోరడం లేదు. ఇండియాలోని ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉందని మా బృందం భావిస్తోంది. ఆహారం, ఇంధనం, ఇతర అవసరాలు అన్నీ మా సంస్థే చూసుకుంటుంది. మా బృందంలో ఆరోగ్య అత్యవసర సిబ్బంది, డ్రైవర్లు, ఇతర సిబ్బంది, వారికి సహాయకులు ఉన్నారు. మీ ఆదేశాలనుసారం దేశంలో ఎలాంటి క్లిష్ట పరిస్థుతులు ఉన్న ప్రదేశాల్లో అయినా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా విజ్ణప్తిని మన్నించి మాకు అనుమతిని ఇస్తారని ఆశిస్తున్నాం’’ అని మోడీకి రాసిన లేఖలో ఈదీ ఫౌండేషన్ పేర్కొంది.

ఈదీ ఫౌండేషన్ పాకిస్తాన్‌కు చెందిన సామాజిక సంక్షేమ సంస్థ. దీనిని అబ్దుల్ సత్తార్ ఈదీ అనే వ్యక్తి 1951లో స్థాపించారు. తన మరణం వరకూ ఆయనే ఆ సంస్థకు అధిపతిగా ఉన్నారు. ఆయన భార్య విల్‌క్విస్ నర్సు. పిల్లలను దత్తత తీసుకునుని పర్యవేక్షిస్తుంటారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో ఉంది. ఈ సంస్థ పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా 24 గంటలు అత్యవసర సేవలనను అందిస్తోంది. పునరావాస కేంద్రాలు, ఉచిత వైద్యశాలలు, వైద్య సహాయం, డ్రగ్ రీహాబిటేషన్ సర్వీసులు, జాతీయ, అంతర్జాతీయ అత్యవసర సేవలను ఈ సంస్థ నుంచి అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: