లక్నో: ఇటీవల దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ఉత్కంఠగా జరిగిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఎన్నికల కమిషన్ ఉత్తరప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలను నిర్వహించింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఎవ్వరూ కూడా ఎటువంటి సంబరాలు జరుపుకోకూడని ప్రకటించింది. కొన్ని రోజుల క్రితమే ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు దాదాపు 20 కిలోల రసగుల్లలను స్వాధీనం చేసుకున్నారు.

 అదేంటి ఎన్నికల ఫలితాలకి, రసగుల్లలకి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నా.. ఎన్నికల ఫలితాలు వచ్చాక విజయోత్సవాలు జరుగడం సర్వసాధారణం. గెలిచిన  పార్టీ అభిమానులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటారు. అయితే దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న కారణంగా ఎటువంటి సంబరాలు చేసుకోకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా ఫలితాల సమయంలో సెక్షన్ 144ను కచ్చితంగా అమలు చేయాలని, ఎవరైన ఈ నిబంధనను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోమని పోలీసులను ఆదేశించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఒకే ప్రదేశంలో నలుగురు అంతకు మించి కనిపిస్తే పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.

 ఈ క్రమంలోనే తమ అభిమాన పార్టీ గెలిచిన సందర్భంగా అక్కడి వారికి రసగుల్లలను పంచుతున్న ఇద్దరు వ్యక్తులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటుగా వారు పంచిపెడుతున్న రసగుల్లలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు దీనికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. దాంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాల సమయంలో కరోనా నిబంధనలను పలు రాష్ట్రాల ప్రజలు ఉల్లంఘించారు. పశ్చిమ బెంగాల్‌లో దీదీ గెలిచిన సందర్భంగా కోల్‌కతాలోని పార్టీ కార్యాలయం ఎదురు కొన్ని వందల మంది పార్టీ జెండాలతో కనిపించారు. అంతేకాకుండా తమిళనాడులోనూ డీఎంకే పార్టీ విజయం సాధించిందని పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున విజయోత్సవాలు జరుపుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: