దేశంలో ఎంతో మంది గొప్ప గొప్ప స్టార్స్ వున్నారు. గొప్ప గొప్ప వ్యాపార వేత్తలు వున్నారు కాని ఈ కష్టకాలంలో వారు ఎవ్వరికి ఉపయోగపడట్లేదు. అలాంటి వారికి కొందరు యువకులు ఆదర్శంగా మారారు. వారికే కాదు ఇప్పుడున్న యూత్ అందరికి వారే ఆదర్శం అనే చెప్పాలి.సామాజిక స్పృహ, సమాజంపై బాధ్యత కలిగిన ఆ యువకులు ఆకలితో అలమటించి పోతున్న కొన్ని వందల మందికి ఆహారాన్ని అందించాలని గట్టి సంకల్పంతో నిర్ణయించుకున్నారు. రోజువారీ ఖర్చులకు వినియోగించుకొనే డబ్బులతో బాషా సిరివెల్ల మరియు అతని స్నేహితులు కలాం ట్రస్టును ఏర్పాటు చేసారు.గత సంవత్సరం లాక్ డౌన్ నుంచి ప్రారంభిమైన అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా ఇవాళ్టి వరకు కొనసాగిస్తున్నారు. తిరుపతిలోని ఫుట్ పాత్ పై దయనీయ స్థితిలో ఉన్న కొందరు వృద్దులు, తల్లితండ్రులు లేని చిన్నారులను చూసి వారికీ ఆహారం అందించడం మొదలు పెట్టారు.

ఇక వీరి మంచి పనులు చూసి ఫిదా అయ్యి బాషా అండ్-కో తో పాటు మరి కొందరు కలసి వచ్చి వందల మంది ఆకలి బాధలను తీరుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్, రుయా ఆసుపత్రి, వివిధ వసతి సముదాయాల వద్ద ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం నిత్యం అందిస్తూ వస్తున్నారు. మిత్రుడు నడుపుతున్న ఓ హాస్టల్ లో ఈ బోజనాలను తయారు చేయించి స్కూటర్ ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్న వారికి ఆహార పొట్లాలు అందిస్తున్నారు. ఇక పూటగడవని వలస కూలీలకు సహాయం అందించి వారికీ ఒక పూటైనా ఆహారం అందేలా చేయాలనుకున్నారు.

తమకు తెలిసిన వారి వద్ద నుంచి బియ్యం, పప్పు, ఇతర సామాగ్రి సమకూర్చి పేదలకు, వలస కూలీలకు అందించారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకడం చాల కష్టంగా మారుతోంది. ఇది గమనించిన ఆ యువత....కరోనా నియమావళి పాటిస్తూ బ్లడ్ క్యాంపు సైతం ఏర్పాటు చేసి అత్యవరస స్థితిలో ఉన్న వారికీ రక్తం అందేలా ఏర్పాటు చేసారు. దాతల సహాయంతో కోవిడ్ బారిన పడ్డ రోగులకు కిట్లను అందజేశారు.ఇలా వీరు తమ శక్తి మేర ప్రజలకు కష్టకాలంలో సాయపడుతూ పలువురికి ఆదర్శంగా మారుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: