న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తోంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు వస్తున్నాయి. ఒకవైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నా కరోనా కట్టడి కావడం లేదు. ఇదే సమయంలో దేశమంతటా పెరుగుతున్న ఆక్సిజన్ సంక్షోభం ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తోంది. రోజురోజుకు కరోనా రోగుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ఈ ఆక్సిజన్ కొరత కారణంగా దేశంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో 12 మంది ఆక్సిజన్ అందక మరణించారు.

 ఇదే విధంగా కర్ణాటకలోనూ దాదాపు 24 మంది, తమిళనాడులో 11 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితులు మరింత విషమంగా మారాయి. రోజురోజుకు రోగుల సంఖ్య పెరగడంతో ఆక్సిజన్ అవసరం కూడా అదేస్థాయిలో పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. రాష్ట్రంలో రోజుకి 700 టన్నుల ఆక్సిజన్ లభిస్తే మరో ప్రాణం పోనివ్వమని, ప్రజలకు తాను భరోసా ఇస్తున్నానని అన్నారు.

అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రాణ వాయువు కొరతను నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ‘రాజధాని రాష్ట్రానికి రోజుకి 700 టన్నుల ఆక్సిజన్ లభిస్తే రోజుకి 9 వేల నుంచి 9.5 వేల వరకు పడకలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంద’ని కేజ్రీవాల్ అన్నారు. అయితే బుధవారం ఢిల్లీ 730 టన్నుల ఆక్సిజన్ అందడంతో రాష్ట్రంలోని ఆసుపత్రులన్నీ తమ పడకల సామార్థ్యాన్ని తిరిగి పెంచాలని కేజ్రీవాల్ అభ్యర్థించారు.

ఇదిలా ఉంటే గత 24 గంటల్లో ఢిల్లీలో 19,133 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 12,73,035కు చేరింది. అలాగే గత 24 గంటల్లో 335 మంది మరణించడంతో రాష్ట్రంలోని మరణాల సంఖ్య 18,398కి చేరింది. అంతేకాకుండా ఢిల్లీ పాజిటివిటీ రేటు కూడా రోజురోజుకు తగ్గిపోతుంది. సోమవారం 30 శాతం నుంచి 24.29 శాతానికి పడిపోయిందని ఆరోగ్య శాఖ వారు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: