రాజ‌కీయాల్లో బ‌ళ్లు ఓడ‌లు..ఓడ‌లు బ‌ళ్లు కావ‌డం అత్యంత స‌హ‌జ ప‌రిణామం. కేంద్ర మాజీమంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి ప‌రిస్థితిని ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. నెల్లూరు నుంచి మూడుసార్లు లోక్‌స‌భ‌కు గెలిచి ఒక‌సారి ఓడిన ఆమె, ఆ స్థానం జ‌న‌ర‌ల్‌గా మారాక 2009 ఎన్నిక‌ల్లో బాప‌ట్ల నుంచి గెలిచి లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. 2014 దాకా కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఆమె ఒక వెలుగు వెలిగారు. అప్ప‌ట్లో సోనియాగాందీ ఆశీస్సుల‌తో మ‌న్మోహ‌న్‌సింగ్ మంత్రివ‌ర్గంలో సైతం ఆవిడ‌కు స్థానం ల‌భించింది. సోనియాగాంధీకి వీర‌విధేయురాలిగా వ్య‌వ‌హ‌రించిన ఆమె రాష్ట్ర విభ‌జ‌న‌ను నాటి రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు అంద‌రూ తీవ్రంగా వ్య‌తిరేకించినా తాను మాత్రం సోనియా వెంటే నిలిచారు. అప్ప‌ట్లో ఇదే అంశంపై ఆమెపై ఏపీ ప్ర‌జ‌ల్లో సైతం తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇక ఆ త‌రువాత కాంగ్రెస్ పార్టీ అటుకేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారం కోల్పోవ‌డంతోపాటు ఆమె బాప‌ట్ల నుంచి ప‌రాజ‌యం పాల‌య్యారు. అప్ప‌టినుంచి ఆ పార్టీ నేత‌ల‌కు రాజ‌కీయంగా గ‌డ్డు రోజులు మొద‌ల‌య్యాయి. కాంగ్రెస్ పార్టీపై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం కార‌ణంగా ఇక రాష్ట్రంలో పార్టీ మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌ని భావించి, ప‌లువురు నేత‌లు ఇత‌ర పార్టీల్లో చేరిపోయారు.

అయితే ప‌న‌బాక ల‌క్ష్మి మాత్రం సైలెంటుగా ఉండిపోయారు. అనంత‌రం 2019 సాధార‌ణ ఎన్నిక‌లకు ముందు ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. తిరుప‌తి  రిజ‌ర్వుడు పార్ల‌మెంట్  స్థానం నుంచి ఆ పార్టీ త‌ర‌పున‌ బ‌రిలోకి దిగినా వైసీపీ ప్ర‌భంజ‌నంలో  బ‌ల్లి దుర్గాప్ర‌సాద‌రావు చేతిలో రెండు ల‌క్ష‌లకు పైగా  ఓట్ల తేడాతో ఓట‌మి పాల‌య్యారు.  అయితే  దుర్గాప్ర‌సాద్ అనారోగ్యంతో మ‌ర‌ణించ‌డంతో ఆ స్థానానికి ఇటీవ‌ల‌ ఉప ఎన్నిక రావ‌డంతో ఆమె మ‌రోసారి టీడీపీ త‌ర‌పున పోటీలోకి దిగి మ‌ళ్లీ ప‌రాజ‌యాన్నిమూట‌గ‌ట్టుకున్నారు. నిజానికి 2019 ఎన్నిక‌ల్లో ఆమెకు దాదాపు ఐదు ల‌క్ష‌ల ఓట్లు వ‌చ్చాయి. ఈసారి ఆమె గ‌ట్టి పోటీ ఇవ్వడం ఖాయ‌మ‌ని అంద‌రూ భావించారు. అయితే గ‌తంలో ప‌డిన‌ ఓట్ల‌లో కూడా భారీగా కోతప‌డ‌టంతో ఆమె షాక్ తిన్నారు. క‌రోనా విస్తృతితోపాటు ప‌లు కార‌ణాలు ఇందుకు కార‌ణ‌మ‌ని టీడీపీ నాయ‌కులు స‌ర్దిచెప్పుకుంటున్నారు ..ఇటు ఓట‌మి భారం..మ‌రోవైపు.. ఓటు బ్యాంకు ప‌డిపోవ‌డం, ఈ మాజీ కేంద్ర మంత్రిని తీవ్ర నిరాశ‌కు, ఆవేద‌న‌కు గురిచేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ రాష్ట్ర నాయ‌క‌త్వం అంతా ఇక్క‌డే మ‌కాం వేసి మ‌రీ ప్ర‌చారం చేసినా ఇంత ఘోర ఓట‌మి ఎందుకు ఎదురైంద‌నే అంశం ఆమెకు మింగుడుప‌డ‌టం లేద‌ని స‌మాచారం.

నిజానికి ఆమెను వైసీపీలో చేర‌మ‌ని గ‌తంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఆహ్వానించినా ఆమె చేర‌లేద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ప్ర‌చారం ఉంది. ఉప‌ ఎన్నిక‌ల్లో పార్టీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ వారాల త‌ర‌బ‌డి తిరుప‌తిలోనే  ఉండి ప్ర‌చారం చేశారు. రోడ్ షోలు నిర్వహించారు. అయినా ఫ‌లితం లేక‌పోయింది. ఉప ఎన్నిక‌ల్లో పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యంతో అయిష్టంగానే పోటీకి దిగాల్సివ‌చ్చింద‌ని,  ఆర్థికంగా కూడా ముందు చంద్ర‌బాబు ఇచ్చినంత భ‌రోసా పోలింగ్‌కు ముందు ఇవ్వ‌లేద‌న్న అభిప్రాయంతో ప‌న‌బాక ఉన్న‌ట్టు స‌మాచారం. ఇక ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో టీడీపీలో ఉంటే త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు అంతంత మాత్ర‌మేన‌న్న అభిప్రాయంతో ఆమె ప్ర‌త్యామ్నాయ మార్గాల వైపు చూసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. అయితే వైసీపీలోకి వెళ్లాలా.. లేక బీజేపీలోకి వెళితే త‌న‌కు రాజ‌కీయంగా మెరుగైన స్థానం ల‌భిస్తుందా అన్న డైల‌మాలో ప‌న‌బాక ఉన్నార‌ట‌. మొత్తంమీద టీడీపీకి ప‌న‌బాక త్వ‌ర‌లోనే గుడ్‌బై చెప్ప‌డం మాత్రం ఖాయ‌మేన‌న్న చ‌ర్చ‌లు ఆమె సొంత జిల్లా నెల్లూరులో విస్తృతంగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: