తెలంగాణ‌లో ఇటీవ‌ల జ‌రిగిన రెండు కార్పొరేష‌న్లు, ఐదు మున్సిపాలిటీల‌కు ఎన్నిక‌లు జ‌రుగ‌గా అన్ని స్థానాల్లో తెరాస ఘ‌న‌విజ‌యం సాధించి మేయ‌ర్‌, చైర్మ‌న్ల పీఠాల‌ను ద‌క్కించుకున్న విష‌యం విధిత‌మే. కాగా మేయ‌ర్‌, చైర్మ‌న్ల అభ్య‌ర్థుల ఎన్నిక నేడు జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల‌ను సీఎం ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలుస్తుండ‌గా.. ఎన్నిక స‌మ‌యానికి పార్టీ ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు స‌మావేశంలో అభ్య‌ర్థి పేరును ప్ర‌క‌టించ‌నున్నారు. ప్ర‌స్తుతానికి మేయ‌ర్, చైర్మ‌న్ల పీఠాల‌కోసం ఆశావ‌హులు భారీగానే ఉన్నారు. త‌మ‌కే అవ‌కాశం ఇవ్వాలంటూ ఇప్ప‌టికే పైర‌వీలు సాగించారు. త‌న‌కే కేటాయిస్తార‌న్న ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

గ‌త నెల 30న ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్లు, అచ్చంపేట‌, జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, సిద్ధిపేట‌, న‌కిరేక‌ల్ మున్సిపాలిటీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. మే3న ఫ‌లితాలు వెలువ‌డ‌గా.. అన్ని పుర‌పాలిక‌ల్లో తెరాస విజ‌య‌దుంద‌భి మోగించి మేయ‌ర్‌, చైర్మ‌న్ పీఠాల‌ను ద‌క్కించుకుంది. నేడు మేయ‌ర్‌, చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ అభ్య‌ర్థు  ఎన్నిక‌కు ఈసీ నోటిఫికేష‌న్ జారీ చేసింది. కాగా ఆయా కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీల్లో అందుకు త‌గ్గ‌ట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు మేయ‌ర్ స్థానాలు, ఐదు చైర్మ‌న్ స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. దీంతో అభ్య‌ర్థుల ఎంపిక అధికార‌పార్టీ నేత‌ల‌కు క‌ష్ట‌త‌రంగా మారింది. ఎవ‌రికివారే త‌మ‌కే అవ‌కాశం వ‌స్తుంద‌న్న ధీమాతో ఉన్నారు.

కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీల్లో మేయ‌ర్లు, చైర్మ‌న్‌ల పేర్ల‌ను సీఎం కేసీఆర్ ఖ‌రారు చేశారు. ఇప్ప‌టికే సీల్డ్ క‌వ‌ర్లో ఖ‌రారు చేసిన పేర్ల‌ను ఉంచి పార్టీ ఎన్నిక‌ల ప‌రిశీల‌కుల‌కు అప్ప‌గించారు. వ‌రంగ‌ల్ మేయ‌ర్‌గా గుండు సుధారాణి, ఖ‌మ్మం చైర్‌ప‌ర్స‌న్‌గా నీర‌జ పేర్లు ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. అదేవిధంగా సిద్ధిపేట క‌డ‌ద‌ర్ల మంజుల‌, జ‌డ్చ‌ర్ల‌లో దోరెప‌ల్లి ల‌క్ష్మి, న‌కిరేక‌ల్‌లో రాచ‌కొండ శ్రీ‌ను, అచ్చంపేట‌లో న‌ర్సింహ‌గౌడ్‌, శైల‌జ‌కు ఎవ‌రికో ఒక‌రికి చైర్మ‌న్ కుర్చీద‌క్క‌నుంది. ఇప్ప‌టికే ఆయా కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీల్లో అధికార పార్టీ నేత‌లు కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్ల‌తో స‌మావేశ‌మై అధిష్టానం నిర్ణ‌య‌మే శిరోధార్య‌మ‌ని, సీఎం కేసీఆర్ ఎవ‌రిపేరును సీల్డ్ క‌వ‌ర్‌లో పంపిస్తే వారికే మేయ‌ర్‌, చైర్మ‌న్ పీఠం ద‌క్కుతుంద‌ని, ఎవ‌రూ నిరాశ‌కు లోనుకావ‌ద్ద‌ని సూచించారు. అయిన‌ప్ప‌టికీ ఎవ‌రికివారు త‌మ‌కే అవ‌కాశం వ‌స్తుంద‌న్న భావ‌న‌లో ఉండ‌టంతో ప‌లు చోట్ల మేయ‌ర్‌, చైర్మ‌న్‌ అభ్య‌ర్థి ఎన్నిక స‌మ‌యంలో నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: