వారూ వీరు అన్నది అసలు చూడదు కరోనా. దానికి వివక్ష అన్న పదం అంటే ఇష్టం లేదు. అందుకే దూసుకువస్తున్న ఆ మహమ్మారి ఎవరినైనా సరే ఉపేక్షించను అంటూ కమ్మేస్తోంది. కేసులు పెంచుకుంటూ పోతూ కుమ్మేస్తోంది.

విశాఖ జిల్లా  విషయానికి వస్తే టాప్ లెవెల్ ఐఏఎస్ అధికారులంతా కరోనా బాధితులుగానే ఉన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ వినయచంద్ స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడ్డారు. ఆయన హోం ఐసోలేటెడ్ అయ్యారు. అక్కడ నుంచే ఆయన తన విధులను నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే విశాఖ కార్పోరేషన్ కమిషనర్ జి సృజన కూడా కొన్ని రోజుల క్రితం కరోనాతో బాధపడుతూ ఇంటికే పరిమితం అయ్యారు. ఆమె కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ అక్కడ నుంచే సమీక్షలు ఇతర ముఖ్యమైన పనులు చూస్తున్నారు.

ఇక రెవిన్యూ విభాగం మొత్తం కరోనా తో అట్టుడుకుతోంది. విశాఖ జిల్లాలో ముగ్గురు జాయింట్ కలెక్టర్లు, డీయార్వో, ఆర్డీవో వంటి వారు అంతా కరోనా బారిన పడ్డారు. ఇక వీఎమ్మార్డీయే సెక్రటరీకి కూడా కరోనా కన్ ఫర్మ్ అయింది. దీంతో పాటు చాలా మంది అధికారులు ఉద్యోగులు కూడా కరోనాతో అవస్థలు పడుతున్నారు. అదే విధంగా చూస్తే ఇప్పటికే కొంతమంది ఉద్యోగులు కరోనా కారణంగా చనిపోయారు కూడా.

దీంతో కరోనా భయంతో ప్రభుత్వ ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అమలు చేయల్సింది అధికారులే. మరి వారే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉంటున్నారు. ఇపుడు వారిని కరోనా చుట్టుముట్టడంతో కరోనా దూకుడుకు హద్దు లేకుండా పోతోంది అంటున్నారు. ఇక విశాఖ జిల్లాలో చూసుకుంటే ప్రతీ రోజూ రెండు వేలకు తక్కువ కాకుండా కేసులు నమోదు కావడంతో జనాలు కూడా బెంబేలెత్తుతున్నారు. ఇదిలా ఉంటే కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాలైన చర్యలు చేపడుతోందని మంత్రి అవంతి శ్రీనివాస్ చెబుతున్నారు. అయితే ప్రస్తుత కరోనా చాలా ప్రమాదకరంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: