కేసీయార్ అపర చాణక్యుడు అని చెప్పాలి. కేవలం ఒకే ఒక్కడుగా నాటి టీడీపీ సర్కార్ నుంచి బయటకు వచ్చిన కేసీయార్ అసాధ్యమైన తెలంగాణా రాష్ట్ర సాధనను టేకప్ చేశారు. దాన్ని కేవలం పదమూడేళ్ళ కాలంలోనే సాధించి తను బహు మొనగాడిని అని నిరూపించుకున్నారు.

ఇక రెండు సార్లు తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కేసీయార్ ముచ్చటగా మూడవసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాలుగా ఆయుధాలను సమకూర్చుకున్నారు. ఇక తెలంగాణాలో ఒకపుడు బలమైన కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఆ పార్టీ పునాదులు కూడా లోతైనవి, దశాబ్దాల నాటివి. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఈ రోజు 20 శాతానికి పడిపోయింది. బీజేపీ కూడా ఇపుడిపుడే తెలంగాణాలో గట్టిగా కాలూనుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆ పార్టీ ఓటింగ్ కూడా పెద్దగా పెరగడమే లేదు.

మరో వైపు చూస్తే ఉమ్మడి ఏపీలో పదిహేడేళ్ళ పాటు రాజ్యం చేసిన తెలుగుదేశం పార్టీ కూడా ఈ రోజు చతికిలపడింది. తెలంగాణాలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా వేరుగా ఉన్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి ఉంది. టీయారెస్ 2014 ఎన్నికల కంటే కూడా ఓటింగ్ శాతాన్ని పెంచుకుని నలభై  శాతానికి ఎగబాకింది.

మొత్తానికి చూస్తే ఈ రోజున తనకు అరవై శాతం ఓట్లు వ్యతిరేకంగా ఉన్నా కూడా విపక్షాల చీలిక కారణంగా టీయారెస్ అత్యంత బలంగా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో   రేపటి రోజున మరిన్ని కొత్త పార్టీలు పుట్టుకువచ్చినా కూదా అది అంతిమంగా టీయారెస్ కే మేలు చేస్తుంది అన్నది రాజకీయ విశ్లేషణ. ఇపుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ పెడతారు అంటున్నారు. ఆయన పార్టీ పెడితే భారీ ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ఓటే చీలిపోతుంది. అంటే ఒక విధంగా రేపటి రోజున అధికారంలోకి వస్తామని భావించే కాంగ్రెస్ కి మొదటి దెబ్బ పడుతుంది. అలాగే బీజేపీకి కూడా ఇబ్బందే. అందుకే ఈటల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా టీయారెస్ కి బేఫికర్ అనే అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈటల ఎపిసోడ్ లో  కావాలనే ఆయనను బయటకు తెచ్చి  కేసీయార్ సూపర్ స్కెచ్ వేశారు అన్నది స్పష్టం అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: