ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కూడా తమ సొంత స్పెస్ స్టేషన్‌ కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ తరుణంలోనే చైనా కూడా ప్రయోగాలు చేస్తూ అందులో భాగంగా ఇటీవల ‘లాంగ్‌ మార్చ్‌ 5బీ’ అనే రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపింది. అయితే ఆ రాకెట్ అదుపుతప్పింది. ఆ రాకెట్ తిరిగి భూమిపై పడటం ఖాయమని నిపుణులు అంటున్నారు. అయితే ఆ రాకెట్ భారత రాజధాని డిల్లీ పడనుందని, ఢిల్లీ వాసులు అప్రమత్తంగా ఉండాలని ఓ నిపుణుడు సూచనలిచ్చారు. తమ లెక్కల ప్రకారం ఈ రాకెట్ రాబోయే 24 గంటల్లో భూమిని తాకుతుందని, ఇది ఢిల్లీపై పడేందుకే ఎక్కువ శాతం అవకాశాలున్నాయని అన్నారు.

అయితే గత కొంతకాలంగా చైనా తన ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలను చెడగొట్టుకుంటోంది. ప్రస్తుతం చైనా అంటే పడని దేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో అగ్ర రాజ్యం అమెరికా కూడా ఒకటి. కరోనా విజృంభణతో ఈ దేశాల మధ్య వైరం మరింత పెరిగింది. ఈ గొడవ ప్రస్తుతం అంతరిక్షం వరకు చేరింది. ఇదే సమయంలో చైనా తన రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపడం, అది అదుపుతప్పి తిరిగి భూమిపైకి వస్తున్న విషయంలో నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా అమెరికా ‘బాధ్యత కలిగిన అంతరిక్ష ప్రవర్తన’కు పిలుపునిచ్చింది. అమెరికా పిలుపునిచ్చిన వెంటనే చైనా దీనిపై స్పందించింది. రాకెట్ శకలాలు భూమిని చేరుకునేలోపే నాశనం అవుతాయని, ఈ విషయంలో అమెరికా కావాలనే రచ్చ చేస్తుందని ఆరోపించింది.

 ఈ నేపథ్యంలో అమెరికాలోని హార్వర్డ్‌ స్మితోజియన్‌ ఆస్ట్రోఫిజికల్‌ అబ్జర్వేటరీ  ఖగోళ శాస్త్రజ్ఞుడు జొనథన్‌ మెక్‌డోవెల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా రాకెట్ శకలాలు ఎక్కడెక్కడ పడే అవకాశాలున్నాయో ఆయన తన అభిప్రాయం చెప్పారు. ఎక్కువ శాతం ఈ రాకెట్ భారత రాజధాని ఢిల్లీపై పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా ఆస్ట్రేలియాలోని సిడ్నీ, బ్రెజిల్‌లోని రియో డీ జెనీరియా నగారలపై కూడా పడే అవకాశాలు ఉన్నాయని జోనాథన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ రాకెట్ భూమి వైపు సెకనుకు 4 మైళ్ల వేగంతో వస్తుందని, దానిని నిర్జించేందుకు చైనా తగు చర్యలు తీసుకుంటే మంచిదని జోనాథన్ తెలిపారు.

ఈ రాకెట్ జనసంచారం ఉన్న ప్రదేశాల్లో కూలితే ఎంతో నష్టం కలుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ చైనా మాత్రం రాకెట్ భూ వాతావరణంలోకి వచ్చిన వెంటనే నాశనం అవుతుందని, ఏమైనా శకలాలు ఉంటే అవి పసిఫిక్ మహాసముద్రంలో పడతాయని అంటోంది. అంతేకాకుండా తాము వాడిన ఇంధనం కారణంగా సముద్ర జలాలు కలుషితం కావని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఈ రాకెట్ శకలాలు ఎక్కడ పడతాయన్న విషయంపై అమెరికాతో సహా ఏ దేశం కూడా కచ్చితమైన సమాధానం చెప్పలేపోతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరో 24 గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: