దేశంలో కరోనా విజృంభిస్తోంది. దేశ ప్రజలు కరోనా దెబ్బకే విలవిలలాడుతుంటే తాజాగా మరో ఫంగల్ ఇన్ఫెక్షన్ వెలుగులోకి వచ్చింది. వైద్యులు దీనిని బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మిసిస్)గా చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కరోనా నుంచి కోలుకున్న వారిలో బయటపడుతోంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని, అంతేకాకుండా ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలిపారు. ఢిల్లీలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు అనేకం నమోదయ్యాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో ఇప్పటికే దాదాపు 40 మంది ఈ ఫంగస్ బారిన పడ్డారు. ఈ ఫంగస్ బారిన పడిన వారిలో 8 మంది కంటి చూపును కోల్పోయారు. ఈ ఫంగస్ కూడా ప్రాణాంతకం అని తేలడంతో ప్రజల్లోని భయాందోళనలు మరింత పెరిగిపోయాయి. అయితే ఈ ఫంగస్‌కు చికిత్స చేస్తే నయమవుతుందని, నిర్లక్ష్యం చేస్తే రోగి కంటి చూపు పోయే ప్రమాదం ఉందని, ఇంకా ఆలస్యం అయితే ప్రాణాలు కూడా పోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఫంగస్ ఎక్కువగా కరోనా రోగుల్లోనే రావడం గమనార్హం. వారిలోనే రావడానికి గల కొన్ని కారణాలను ఢిల్లీలోని సర్ గంగారామ్ హస్పిటల్‌లోని ఈఎన్‌టీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ వివరించారు. కరోనా రోగుల్లో ఎక్కువ మంది డయాబెటీస్‌తో బాధపడుతున్నారని, వారికి కరోనా చికిత్సలో వాడే ఔషదాల ప్రభావం వల్ల ఈ ఫంగస్ వచ్చేందుకు ఆస్కారం ఉందని ఆయన తెలిపారు. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ రోగుల్లో ఈ ఫంగస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. అంతేకాకుండా గత ఏడాది కూడా ఈ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, దీని బారిన పడిన వారిలో కొందరు కంటి చూపు కోల్పోగా, మరికొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారని ఆయన వెల్లడించారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఈ ఫంగస్ ఎక్కువగా దాడి చేసేందుకు అవకాశాలున్నాయని చెప్పారు.

అయితే మ్యూకోర్మిసెటెస్ అనే ఫంగి ద్వారా ఈ ఇన్ఫెక్షన్ బాధితుల్లోకి వస్తుందని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధికారులు తెలిపారు. ఈ ఫంగి వాతావరణంలోనే ఉంటుందని, చర్మం తెగినా, కాలినా, ఇతర గాయాల్లోనూ ఈ ఫంగి కనిపిస్తుందని చెప్పారు. ఇది ఎక్కువగా సైనస్, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని సీడీసీ అధికారులు వెల్లడించారు. అయితే కరోనా తగ్గిన 2-3 రోజుల్లో ఈ ఫంగస్ లక్షణాలు బయటపడతాయని, మొదట సైనస్‌లో ఆ తర్వాత కళ్లలో ఈ ఫంగస్ లక్షణాలు కనిపిస్తాయని సూరత్‌లోని ఈఎన్‌టీ స్పెషలిస్ట్ డాక్టర్ సంకేత్ షా వెల్లడించారు. ఈ ఫంగస్ వచ్చినప్పుడు మొదటగా ముక్కులో ఏదో అడ్డంగా ఉన్నట్లు అనిపిస్తుందని, అదే సమయంలో ముక్కులో నల్లని కణితులు ఏర్పడతాయని, ఆ తర్వాత కళ్లకు పాకుతుందని, అప్పుడు కళ్ళు, చెంపలు వాపు వస్తుందని ఆయన ప్రకటించారు.

ఈ ఫంగస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించిన వెంటనే దీనిని నిలువరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని వైద్యులు అంటున్నారు. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో ముఖంలో వాపు కనిపించడం, తలనొప్పి, ముక్కు దిబ్బడ, జ్వరం, నోటి పై భాగంలో నల్లటి గాయాల మాదిరిగా కనిపించి తీవ్రమైన బాధ కలిగిస్తూ పెద్దవవుతుంటాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే బయాప్సీ చేయించుకోవాలి. అలాగే వైద్యుల సలహాతో యాంటీ-ఫంగల్ థెరపీ చేయాలని, లేకపోతే తర్వాతి 24 గంటల్లో మెదడు వరకు కూడా ఇది వెళ్లవచ్చని వైద్యులు తెలిపారు. ఈ ఫంగస్ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదని, ఆలస్యం అయితే ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: