డ్రోన్ కెమెరాల ద్వారా మారుమూల ప్రాంతాలకు, అత్యవససరమైన వారికి, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. టెక్నాలజీని వాడుకోవడం కరెక్టే.. కానీ అదే సమయంలో అంతకంటే అత్యవసరమైన వాటిని పక్కనపెట్టి, డ్రోన్లతో మందులు సరఫరా చేస్తున్న తొలి రాష్ట్రం మనదే, ఇదే మన ఘన విజయం అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని నిలదీస్తున్నాయి ప్రతిపక్షాలు. డ్రోన్ కెమెరాలను వాడడానికి ముందు.. ఆస్పత్రుల్లో కనీస వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. వ్యాక్సినేషన్ తొలి డోసు ఆపేస్తున్నామని ప్రకటించిన తెలంగాణ సర్కారు, ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం, డ్రోన్ల వ్యవహారాన్ని పక్కనపెట్టి.. ముందు పరిస్థితులు చక్కదిద్దాలంటూ హితవు పలుకుతున్నాయి.

డ్రోన్లతో మందులు ఎలా..? ఎప్పటినుంచి..?
తెలంగాణ వ్యాప్తంగా మేనెల చివరినుంచి, లేదా జూన్ మొదటి వారం నుంచి డ్రోన్ల ద్వారా కరోనా ఔషధాల పంపిణీ చేపట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముందుగా వికారాబాద్‌ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గరిష్టంగా 30 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలకు టీకాలను, ఔషధాలు పంపిణీ చేస్తారు. ఎక్కువదూరం ప్రయాణించే సామర్థ్యం గల డ్రోన్లను అద్దెకు తీసుకొని వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మొదటి దశలో 7 డ్రోన్లతో 24 రోజుల పాటు ప్రయోగాత్మకంగా రవాణా చేపడతారు. వాటి పనితీరును పరిశీలించి, సాంకేతిక సమస్యలుంటే పరిష్కరించి.. రాష్ట్రవ్యాప్తంగా దీన్ని వినియోగంలోకి తెస్తారు.

తెలంగాణలో డ్రోన్ల ద్వారా అత్యవసర కరోనా ఔషధాల రవాణాకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో నిబంధనను సడలించింది. ప్రయాణ పరిమితిని తొలగిస్తూ ఎంత దూరమైనా వెళ్లడానికి అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కొవిడ్‌ టీకాలు, ఔషధాల పంపిణీ కోసం డ్రోన్లు వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అనుమతి కోరగా గతవారం అనుమతులు వచ్చాయి. ఆ నిబంధనల ప్రకారం కనుచూపు మేరకే, అంటే దాదాపు 5 కిలోమీటర్ల మేర డ్రోన్లు వినియోగించాలి. ఈ నిబంధన సడలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖకు మరోసారి లేఖ రాసింది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొన్న కేంద్రం అపరిమిత దూరం డ్రోన్లను వినియోగించేందుకు అనుమతించింది. కనుచూపు మేర కంటే ఎక్కువ దూరం డ్రోన్ల రవాణాకు కేంద్ర పౌరవిమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ అనుమతించడం హర్షణీయమని అంటున్నారు తెలంగాణ అధికారులు.

డ్రోన్ల వ్యవహారంలో కేంద్రం మరిన్ని అనుమతులివ్వడంతో తెలంగాణలో ఈ ప్రక్రియ విజయవంతం అవుతుందని, దేశంలోనే ఇలా డ్రోన్ల ద్వారా మందులు పంపిణీ చేసి తెలంగాణ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రతిపక్ష నేతలు మాత్రం ముందు ఆస్పత్రుల్లో వసతులు మెరుగు పరచాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: