కరోనా సెకండ్‌ వేవ్‌ ధాటికి వణికిపోతున్న ఢిల్లీలో ఆక్సిజన్‌ సంక్షోభం ముగిసిందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ స్ప‌ష్టం చేశారు. మ‌రో మూడు నెలల్లో దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆక్సిజ‌న్ కొర‌త పూర్తిగా తీరిపోవ‌డంతో పాటు అందరికీ వ్యాక్సిన్‌ అందించడానికి కృషి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. దిల్లీలో కరోనా పరిస్థితులపై కేబినెట్‌లో చర్చించి ఇందుకు కార్యాచరణ సిద్ధం చేశామని అరవింద్ కేజ్రీవాల్‌ ప్రకటించారు. వాస్త‌వానికి ఢిల్లీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. శ్మశాన వాటికల దగ్గరకు భారీ సంఖ్యలో మృతదేహాలు చేరుతున్నాయి. శ్మశానవాటికల దగ్గర ఈ స్థాయిలో మృతదేహాలను మునుపెన్నడూ చేరలేదని ఢిల్లీలోని ఓ శ్మశాన వాటిక దగ్గర పనిచేస్తున్న సిబ్బంది చెబుతున్నారు. వీరి వ్యాఖ్యలు దేశ రాజధానిలో కరోనా ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేస్తోంది.


దేశం మొత్తం కేసుల్లో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌, తెలంగాణ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, జార్ఖండ్ రాష్ట్రాల్లో న‌మోద‌వుతూ వ‌స్తున్నాయి. దిల్లీలో కరోనా వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు 18వేలకుపైగా కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం గడిచిన రెండు వారాల్లోనే దాదాపు 6వేల మంది మృత్యువాతపడటం ఢిల్లీలో భ‌యాన‌క వాతావ‌ర‌ణానికి అద్దం పడుతోంది. కొన్ని రోజులుగా నిత్యం అక్కడ దాదాపు 400లకు పైగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువ మంది రోగులు ఆక్సిజ‌న్ అంద‌క‌నే మృతిచెందుతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.


ఈ నేప‌థ్యంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.దిల్లీలో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత సమస్య పరిష్కారం అయ్యింది. ఇప్పటినుంచి ఏ ఒక్క రోగికి అసౌకర్యం కలగదన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తామని.. మూడు నెలల్లోనే అందరికీ అందిస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ నిలిచిపోతున్న విష‌యం తెలిసిందే. రెండో డోస్ కోసం అనేక రాష్ట్రాలు మొద‌టి డోస్ కోసం వ‌చ్చేవాళ్ల‌ను తిప్పి పంపిస్తున్నాయి. వ్యాక్సిన్ కొర‌త తీర‌డానికి క‌నీసం ఆరు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌న్న‌ది ప్రాథ‌మిక అంచ‌నా మాత్ర‌మేన‌ని చెబుతున్నారు. కేజ్రీవాల్ మూడు నెల‌ల్లోనే అంద‌రికీ వ్యాక్సిన్ అందేలా చూస్తామ‌ని చెబుతుండ‌టం అంత న‌మ్మ‌శ‌క్యంగా లేద‌ని ఢిల్లీ ప్ర‌జ‌లు పేర్కొంటున్నారంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: