త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల ప్ర్ర‌క్రియ ముగిసి.. కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరిన మ‌రుస‌టి రోజే సంపూర్ణ లాక్ డౌన్‌ను ఈనెల 10 నుంచి అమ‌లుకు వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి గ‌డిచిన రెండు నెల‌ల కాలంలో త‌మిళ‌నాడులో క‌రోనా ఉగ్ర‌రూపం చూపుతోంది.  భారీగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు 14 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు శ‌నివారం ఉద‌యం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.  10వ తేదీ నుంచి ఉదయం 4 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 4 గంటల వరకు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.  కిరాణ, కూరగాయలు, మాంసం దుకాణాలు, ఫార్మాసీ దుకాణాలు మినహా మిగతా అన్ని దుకాణాలు మూసివేయనున్నట్లు తెలిపింది.


ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడులో శుక్రవారం ఒక్క రోజే 26,465 కొత్త కేసులు నమోదు కావ‌డం గ‌మ‌నార్హం. క్రియాశీల కేసులు 1.35 లక్షలకు చేరుకున్నాయి. 197 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు 15,171కి పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 13.23లక్షలకు చేరాయి. చెన్నైలో కరోనా కారణంగా సగటు మరణాల సంఖ్య గత రెండు నెలల్లో వేగంగా పెరిగింది. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) అధికారిక సమాచారం ప్రకారం.. మార్చిలో నగరంలో ప్రతి రోజూ సగటున ముగ్గురు వ్యక్తులు కొవిడ్‌ కారణంగా మృతి చెందారు.వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు టెస్ట్-ట్రాక్-ట్రీట్ ప్రోటోకాల్‌ను సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు చీఫ్‌ సెక్రెటరీ రాజీవ్‌ రంజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షల్లో ఇన్ఫెక్షన్లను గుర్తించి వేరు చేయడం అవసరమని, అలాగే కాంటాక్టులను గుర్తించి నిర్బంధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


ఎన్నిక‌ల ప్రచారం, సాధార‌ణంగానే సెకండ్ వేవ్ ప్ర‌భావంతో రాష్ట్రంలో వైర‌స్ వ్యాప్తితో కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిన‌ట్లుగా నూత‌న ప్ర‌భుత్వం భావిస్తోంది. క‌రోనా క‌ట్ట‌డి చేయ‌డానికి లాక్‌డౌన్ త‌ప్పా గొప్ప మార్గం మ‌రేమీ లేద‌ని భావించిన‌ట్లు స‌మాచారం. అందుకే  స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజే పూర్తి స్థాయి లాక్ డౌన్ విధింపు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. శుక్రవారం సీఎంగా ప్రమాణం చేసిన ఆయన కొవిడ్ నేపథ్యంలో కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. కొవిడ్ సాయంగా తమిళనాడులో రేషన్ కార్డు కలిగిన 2.07కోట్ల కుటుంబాలకు రూ.4వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.






మరింత సమాచారం తెలుసుకోండి: