ఇప్పుడు తెలంగాణలో సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల ఎపిసోడ్ నడుస్తోంది. ఇలా గతంలోనూ కొందరు మంత్రులు ముఖ్యమంత్రులను ఎదిరించారు..వారెవరు..వారు చివరకు ఏమయ్యారో చూద్దాం.. గతంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి ఎసి సుబ్బారెడ్డితో పెద్ద గొడవ నడించిందట. ఆ తర్వాత సుబ్బారెడ్డిని తొలగించారు. ఆ తర్వాత చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పడుు  1978లో కోనేరు రంగారావుపై హౌసింగ్ శాఖలో జరిగిన స్కామ్ పై ఆరోపణలు వచ్చాయి. ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి విచారణ చేయించి కోనేరు తప్పు ఏమీ లేదని తేల్చి తిరిగి మంత్రి పదవి కట్టబెట్టారు.


ఇక ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి అయిన తొలి నెలల్లోనే ఎమ్.రామచంద్రరావు అనే మంత్రిని కూడా అవినీతి ఆరోపణల కారణంగా పదవి నుంచి తొలగించారు. ప్రాంతీయ పార్టీలలో ఎక్కువ సందర్భాలలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఒకరే ఉంటారు కనుక వారిదే సర్వాధిపత్యంగా ఉంటుంది. అందువల్ల పార్టీ పరంగా విబేధించినా, ప్రభుత్వపరంగా అభిప్రాయ బేదాలు వచ్చినా మంత్రి పదవులు పోతాయి. అయితే ఎన్.టి.ఆర్. 1994లో అఖండ విజయం సాధించిన కొద్ది నెలలకే తన మంత్రివర్గ సభ్యులుగా ఉన్న చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు, మాధవరెడ్డి, విద్యాధరరావు, దేవేందర్ గౌడ్ లతో విబేదాలు వచ్చాయి.


వారిని పదవుల నుంచి,పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఎన్.టి.ఆర్ .ప్రకటించినా, చివరికి ఎన్.టి.ఆరే పదవిని కోల్పోయారు. ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలను కూడగట్టిన సంగతి తెలిసిందే. ఇక కేసీఆర్ విషయానికి వస్తే.. ఆ మధ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను ఆకస్మికంగా పదవి నుంచి తొలగించి , ఆయన బదులు లోక్ సభ సభ్యుడిగా ఉన్న కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిని చేశారు. కాకపోతే అప్పట్లో రాజయ్యపై అవినీతి, ఇతర కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇక ఇప్పుడు మాత్రం ఈటలపై అవినీతి ఆరోపణలు రాలేదు. ఆయన అస్సైన్డ్ భూములు కొనుగోలు చేశారన్నది అభియోగం. అయితే తాను సంబంధిత రైతులకు ఆరు లక్షల రూపాయల చొప్పున ఎకరాకు చెల్లించానంటున్నారు. చివరకు మంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: