రాజకీయాల్లో నిందలు సహజం. కానీ అవి పెరిగి పెద్దవై ఏకంగా ప్రత్యర్ధులను టార్గెట్ చేస్తున్నాయి. పరస్పర వ్యక్తిత్వ హననానికి దారితీస్తున్నాయి. ఏపీలో కరోనా వేళ భీకరంగా రాజకీయ రచ్చ కూడా సాగడం విచారకరం.

ఏపీలో కరోనా పెద్ద ఎత్తున పెరగడానికి జగన్ సర్కర్ విధానాలే కారణం అని టీడీపీ అంటోంది. జగన్ కరోనా పట్ల పెద్ద సీరియస్ గా లేరని కూడా వారు నిందిస్తున్నారు. కరోనా ఏపీని వెల్లువలా అల్లుకుంటూంటే జగన్ తాపీగా సమీక్షలు నిర్వహించడమేంటి అని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు మండిపడుతున్నారు. జగన్న అమ్మ ఒడి ఇపుడు అవసరమా అని కూడా నిలదీస్తున్నారు. ఇపుడు చేయాల్సింది కరోనా కట్టడి. దాని విషయంలో దూకుడుగా సర్కార్ ఉండాలి.

కానీ సీఎం నాన్ సీరియస్ గా ఉంటే ఎలా అని తమ్ముళ్ళు తలంటున్నారు. తాము సలహాలు ఇస్తే తప్పా, ప్రశ్నిస్తే నేరమా, పాపమా అని కూడా నిలదీస్తున్నారు. జగన్ కి పాలన చేతకాకకే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం వల్లనే ఏపీలో కరోనా ఉధృతం అయింది అని కూడా అంటున్నారు. మరో వైపు చూస్తే ఈ ఆరోపణలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. లోకల్ బాడీ ఎన్నికలను జగన్ వద్దనే వద్దు అన్నారు. కానీ కోర్టుల దాకా వెళ్ళి మరీ పెట్టించింది ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు.

అదే విధంగా ఏపీలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ పెద్ద ఎత్తున తిరిగి పది రోజుల పాటు ప్రచారం చేసింది చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరో వైపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా విస్తృతంగా తిరిగింది కూడా చంద్రబాబే అని చెబుతున్నారు. చేసిందంతా చేసి ఇపుడు ఏపీలో  కరోనా కేసులు ఎక్కువ అయ్యాయని తమ మీద పడి ఏడవడం ఏంటి అని కస్సుమంటున్నారు. ఇక వైసీపీ మంత్రి కోడాలి అయితే ఏపీలో కరోనా పెరగడానికి చంద్రబాబు ఆయన అనుకూల మీడియాయే కారణమని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తూంటే కరోనా తగ్గించాలని అధికార పార్టీ విపక్ష పార్టీ కృషి చేయడంలేదు, తమ మధ్య రాజకీయానికి నిప్పంటించి ఈ విషాద వేళ కూడా చోద్యం చూస్తున్నారు అని మేధావుల నుంచి విమర్శలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: