దేశంలో కరోనా విజృంభిస్తోంది. దేశ ప్రజలు కరోనా దెబ్బకే విలవిలలాడుతుంటే తాజాగా మరో ఫంగల్ ఇన్ఫెక్షన్ వెలుగులోకి వచ్చింది. వైద్యులు దీనిని బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మిసిస్)గా చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కరోనా నుంచి కోలుకున్న వారిలో బయటపడుతోంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని, అంతేకాకుండా ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలిపారు. ఢిల్లీలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు అనేకం నమోదయ్యాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.

 గుజరాత్‌లో ఇప్పటికే చాలా మంది ఈ ఫంగస్ బారిన పడ్డారు. ఈ ఫంగస్ బారిన పడిన వారిలో 8 మంది కంటి చూపును కోల్పోయారు. ఈ ఫంగస్ కూడా ప్రాణాంతకం అని తేలడంతో ప్రజల్లోని భయాందోళనలు మరింత పెరిగిపోయాయి. అయితే ఈ ఫంగస్‌కు చికిత్స చేస్తే నయమవుతుందని, నిర్లక్ష్యం చేస్తే రోగి కంటి చూపు పోయే ప్రమాదం ఉందని, ఇంకా ఆలస్యం అయితే ప్రాణాలు కూడా పోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.అయితే ఇప్పటికే దేశంలో అనేక మంది ఈ ఫంగస్ బారిన పడి తన కంటిచూపును కోల్పోయారు.

 ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ ఫంగస్ రోజురోజు బలం పుంజుకుంటుంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఈ ఫంగస్ రావడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది. ఒకవైపు కరోనాను కట్టడి చేసేందుకు సరికొత్త పథకాలను యోచిస్తున్న ప్రభుత్వాలకు ఇప్పుడ ఈ ఫంగస్‌ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలు పాలుపోవడం లేదు. అయితే ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేస్తు ఓ నిర్ణయానికి వచ్చింది.

 రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఈ బ్లాక్ ఫంగస్‌ బాధితుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఫంగస్ బాధితులకు చికిత్స చేసేందుకు కావలసిన యాంటీ ఫంగల్ ఔషధాలను భారీగా దిగుమతి చేసుకుంది. అయితే ఇప్పటి వరకు గుజరాత్‌లో దాదాపు 100 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 19 మంది అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: