న్యూఢిల్లీ: దేశంలోని విపత్కర పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి రోజు పెరుగుతున్న కేసులు, విఫలం అవుతున్న ప్రభుత్వం, ప్రాణాలు కోల్పోతున్న అమాయకపు ప్రజలు ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఇవే. దేశంలో ఒకపైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నా ప్రజలందరికీ అందుబాటులోకి రావడం లేదు. దేశ రాజధానిలోనూ ఇదే పరిస్థితి.

అయితే గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కేసులు విపరీతంగా పెరిగాయి. అంతేకాకుండా రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత పీడించింది. ఆ సమయంలో కేంద్రం ఇచ్చిన సహకారంతో ఢిల్లీ ఆక్సిజన్, పడకల కొరతను రాష్ట్ర ప్రభుత్వం నిలువరించింది. అయితే కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సిన్‌ల కొరత ఏర్పడింది.

 ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ‘పూర్తి దేశంలో కేవలం రెండు కంపెనీలు మాత్రమే వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయి. ఆ కంపెనీలు ఒక నెలకు కేవలం 6 నుంచి 7 కోట్ల వ్యాక్సిన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. ఇదే తరహాలో కొనసాగితే దేశంలోని వారంతా వ్యాక్సిన్ పొందాలంటే దాదాపు 2 సంవత్సరాల కాలం పడుతుంది. అప్పటికి దేశం చాలా కరోనా వేవ్‌లను ఎదుర్కొంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్ తయారీని యుద్ద ప్రాతిపదికన చేపట్టాలి. వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి జాతీయ స్థాయి ప్రణాళిక సిద్ధం చేయాల’ని కేజ్రీవాల్ అన్నారు.

 అంతేకాకుండా వ్యాక్సిన్ కోసం కేవలం రెండు కంపెనీల పైనే  ఆధారపడకూడదని, వాటి దగ్గర నుంచి ఫార్ములా తీసుకొని వ్యాక్సిన్‌ సమర్థవంతంగా తయారు చేయగల దేశీయ సంస్థలకు అందించాలని కేజీవ్రాల్ సూచించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా చేసేందుకు కేంద్రానికి అధికారం ఉంటుందని కేజ్రీవాల్ అన్నారు. వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని ఒరిజినల్ వ్యాక్సిన్ తయారీదారులకు చెల్లించాలని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: