జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పరిస్థితులు అంత బాగోలేదనే చెప్పాలి. కేవలం కరోనా వల్లే కష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు ప్రతిపక్షాల విమర్శలు, ఇటు పలు రకాల సమస్యలతో జగన్ ప్రభుత్వం సతమతవుతుంది. అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజల్లో మాత్రం జగన్ అంటే విశ్వాసం పోలేదని అర్ధమవుతుంది. అలాగే జగన్‌పై వచ్చే నెగిటివ్ ప్రచారాన్ని కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.


తాజాగా తిరుపతి రుయా హాస్పిటల్‌లో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. అయితే అధికారికంగా లెక్కలు ఇలా ఉంటే, అనధికారికంగా 30 మంది వరకు చనిపోయి ఉంటారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ప్రతిపక్షాలు జగన్‌ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ముమ్మాటికి ఇది ప్రభుత్వం తప్పిదమే అని మాట్లాడుతున్నారు.


అయితే ఆక్సిజన్ అందని విషయంలో ప్రభుత్వాన్నే నిందించాల్సి ఉంటుంది. అలాగే దీనికి అక్కడి డాక్టర్లు, ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు వస్తున్నట్లు కనిపించడం లేదని తెలుగు తమ్ముళ్ళు బాగా ఆవేదన చెందుతున్నారు. అదే జగన్ ప్లేస్‌లో చంద్రబాబు ఉంటే పరిస్తితి వేరుగా ఉండేదని, అందరు చంద్రబాబుని ఏకీపారేసేవారని, అసలు చంద్రబాబే చంపేశారని మాట్లాడేవారని అంటున్నారు.


గోదావరి పుష్కరాలు సమయంలో చంద్రబాబుని ఎలా టార్గెట్ చేశారో అంతా తెలుసని, చంద్రబాబు సీఎం పీఠం నుంచి దిగే వరకు దానిపై విమర్శలు చేస్తూనే వచ్చారని, ముఖ్యంగా సోషల్ మీడియాలో, మీడియాలో బాబుపై ఎలాంటి విమర్శలు చేశారో తెలిసిందే అంటున్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక గోదావరిలో బోటు ప్రమాదం, విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటన, ఇప్పుడు పలు ఆసుపత్రుల్లో కరోనా రోగులు ఆక్సిజన అందక చనిపోతున్నారని, కానీ ఈ అంశాలపై ప్రతిపక్ష టీడీపీ మినహా ఎవరు పెద్దగా స్పందించడం లేదని, ముఖ్యంగా పలు మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో న్యూట్రల్ పేజ్‌లు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ విషయంలో జగన్‌కు కలిసొస్తుందనే చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: