ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయాక చాలామంది నాయకులు సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి చాలామంది నాయకులు జంప్ చేసేశారు. అలాగే జగన్ ప్రభుత్వం దెబ్బకు తట్టుకోలేక పలువురు నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. అలా ఏపీ రాజకీయాల్లో కనిపించని నాయకుల్లో మాజీ మంత్రి కొండ్రు మురళి కూడా ఒకరు.


ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించి, మంత్రిగా పనిచేసిన కొండ్రు 2019 ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చేశారు. అసలు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్తితి ఘోరంగా తయారైన విషయం తెలిసిందే. అయినా సరే కొండ్రు 2014లో కాంగ్రెస్ తరుపున రాజాంలో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. ఇక కాంగ్రెస్‌లో ఉంటే లాభం లేదని, టీడీపీలోకి వచ్చేశారు.


కొండ్రు టీడీపీలోకి రావడమే రాజాం టిక్కెట్ దక్కించుకున్నారు. అప్పటివరకు రాజాంలో కీలకంగా ఉన్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతిని కాదని చంద్రబాబు కొండ్రుకు సీటు ఇచ్చారు. అయితే జగన్ వేవ్‌లో కొండ్రు ఘోరంగా ఓడిపోయారు. ఇక ఓడిపోయిన దగ్గర నుంచి కొండ్రు ఏపీ రాజకీయాల్లో కనిపించడం లేదు. ఏదో జగన్ మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించినప్పుడు బయటకొచ్చి, విశాఖని రాజధానిగా చేయడాన్ని సమర్ధించారు.


ఇలా జగన్ నిర్ణయాన్ని సమర్ధించడంతో కొండ్రు వైసీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. అలా అని కొండ్రు టీడీపీలో కనిపించడం లేదు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కనిపించలేదు. దీంతో రాజాం బాధ్యతలు ప్రతిభా భారతిని చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే వయసు మీద పడుతుండటంతో భారతి పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. కానీ ఆమె కుమార్తె గ్రీష్మ మాత్రం బాగానే యాక్టివ్‌గా ఉంటున్నారు.


కింజరాపు ఫ్యామిలీ సపోర్ట్‌తో నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు సోషల్ మీడియాలో కూడా గ్రీష్మ పార్టీ వాయిస్‌ని గట్టిగానే వినిపిస్తున్నారు. అయితే కొండ్రు కూడా సైడ్ అయిపోవడంతో నెక్స్ట్ రాజాం టిక్కెట్ తమ ఫ్యామిలీనే దక్కించుకునేందుకు మాజీ స్పీకర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి మాజీ స్పీకర్‌కు లైన్ క్లియర్ అవుతుందో లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: