భారతదేశంలో కరోనా కేసులు నమోదు ఈ రోజు కాస్త తగ్గిన సంగతి తెలిసిందే. రోజువారీ కేసులు గత నాలుగైదు రోజులుగా నాలుగు లక్షలకు పైగా నమోదు అవుతుంటే ఈ రోజు మాత్రం మూడు లక్షల 30 వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి.. అయితే మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, తెలంగాణ, చండీగఢ్, డామన్ డయ్యూ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కేసులు తగ్గుతూ వస్తున్నాయని భారత ఆరోగ్య శాఖ తెలిపింది. 

 

 

వీటితో పాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా రోజువారీ కేసు తగ్గుతున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడంతో దాదాపుగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ లోకి వెళ్లి పోయినట్టే. కేవలం ఆంధ్ర ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లాంటి చోట్ల పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇక భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి, మరణాల రేటు పెరగుతుండటంపై డబ్ల్యూహెచ్‌వో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశంలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య, మరణాల రేటు ఆందోళన కలిగిస్తుందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు. 

 

కరోనా కేసుల సంఖ్య, మరణాలపై వాస్తవ సంఖ్యలు రిపోర్ట్ చేయాలని సౌమ్య స్వామినాథన్ భారత ప్రభుత్వాన్ని కోరారు. ఇన్స్ ట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనా ప్రకారం ఆగస్టు నాటికి ఒక మిలియన్ కరోనా మరణాలు సంభవించే అవకాశం ఉందని సౌమ్య చెప్పారు. ప్రపంచంలో ప్రతి దేశం వాస్తవానికి అసలు కేసుల సంఖ్య, మరణాల సంఖ్య నిజమైన సంఖ్యకు తక్కువగా చెబుతోందని, దీంతో కరోనా వాస్తవ సంఖ్యలు, మరణాల రేటును తెలుసుకోవడానికి  తాము కసరత్తు పెంచాలని నిర్ణయించినట్లు సౌమ్య చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: