ముంబై: దేశంలో అధికంగా కరోనా బాధించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రం మహారాష్ట్ర. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులను కట్టడిచేసేందుకు రాష్ట్రప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రాన్ని వ్యాక్సిన్ కొరత పీడిస్తోంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 18 నుంచి 44 సంవత్సరాల వారికి వ్యాక్సిన్ అందించనున్నట్లు ఇటీవల ప్రకటించింది.

 అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరత దృష్టిలో పెట్టుకొని తన ప్రకటనను వెనక్కి తీసుకుంది. రాష్ట్రంలో 18-44 వయసు వారికి వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా వారి కోసం కేటాయించిన 3 లక్షల టీకాలను 45 సంవత్సరాలు పైబడిన వారికి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇప్పటికే మొదటి డోసు టీకాను అందుకొని రెండో డోసు కోసం వేచి చూస్తున్న వారికి ఈ వ్యాక్సిన్లను బదలాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు.

 అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల మంది రెండో డోసు టీకా కోసం ఎదురుచూస్తున్నారని, 45 ఏళ్లు దాటిన వారి కోసం 35 వేల కోవ్యాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. అందుచేత రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నామని, వారికి కేటాయించిన వ్యాక్సిన్‌ను 45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోసుగా అందిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ఒక డోసు వేసి రెండో డోసు వేయకపోతే వారికి మరిన్ని ఇబ్బందులు వస్తాయని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు చెప్పారు.

 అయితే రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తగు నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో కూడా పడకల సంఖ్యను పెంచుతున్నామని, వైద్య సదుపాయాలను కూడా మెరుగుపరుస్తున్నామని, ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని తెలిపారు. దాంతో పాటుగా రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరతపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: