కరోనా పరిస్థితుల్లో అధికార పార్టీ సరిగ్గా పని చేయడం లేదని ప్రతిపక్షనేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్.. ఇటీవల తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. ట్విట్టర్ ద్వారా రోజూ అనేక పోస్టులు పెడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే చంద్రబాబు అసలు విషయాలను వక్రీకరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ.. రాజకీయాలు చేస్తున్నారని అధికార పక్షం అంటోంది. తాజాగా.. తిరువూరులో 108 సిబ్బంది కరోనా రోగి చనిపోతే.. నడిరోడ్డుపై వదిలేశారంటూ ఓ వీడియో పోస్టు చేశారు.

 

కరోనా బాధితులను నడిరోడ్డున వదిలేసి కుయ్ కుయ్ మంటూ వెళ్లిపోతున్నాయి 108 వాహనాలు. తిరువూరులో కరోనాతో బాధపడుతున్న షేక్ సుభానీని 108 వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్తూ, మధ్యలో చనిపోతే మానవత్వం లేకుండా నడిరోడ్డు మీదే వదిలేయడం అమానుషం, అనాగరికం. ఈ ఘటనకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు? అంటూ ఓ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోపై మంత్రి ఆళ్ల నాని స్పందించారు. కృష్ణా జిల్లా తిరువూరు అంబులెన్స్‌ విషయంలో చంద్రబాబు వాస్తవాలను వక్రీకరించారన్నారు.

నిరుపేద కుటుంబంలో విషాదానికి రాజకీయాన్ని జోడించిన చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారన్న నాని.. అసలు జరిగింది ఇదీ అంటూ వివరించారు. మృతదేహం తరలింపులో మానవత్వం చూపిన 108 సిబ్బందిపై ప్రతిపక్షనేత విష ప్రచారం చేస్తున్నారని.. ఈ ఘటనలో మృతుని బంధువుల కోరిక మేరకు గ్రామ సరిహద్దుల్లో మృత దేహాన్ని విడిచిన విషయాన్ని  చంద్రబాబు కావాలనే దాచి పెడుతున్నారని అంటున్నారు.

ఈమేరకు లేఖ కూడా బంధువులు రాసిచ్చారని మంత్రి ఆళ్ల నాని అంటున్నారు. దీనిపై చంద్రబాబు చిలువలుపలవలు చేసి ట్విట్టర్లో దుష్ప్రచారం చేస్తున్నారని.. విపత్తులో అమానవీయతను చంద్రబాబు ప్రదర్శిస్తున్నారని.. కరోనా మహమ్మారి దేశాన్ని అతాలకుతలం చేస్తున్న సమయంలో చంద్రబాబు, లోకేష్‌ల ఉన్మాద ధోరణి కనిపిస్తోందని మంత్రి ఆళ్ల నాని అంటున్నారు.  ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న సిబ్బంది నైతిక స్థైర్యాన్ని ప్రతిక్షణం దెబ్బకొట్టేలా వీరి తీరు ఉంటోందన్న మంత్రి.. శవరాజకీయాలు, అబద్ధపు ప్రచారాలు, ప్రజలను భయపెట్టే వ్యాఖ్యలు ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి వీరు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ఎక్కడ ఏం జరిగినా దాన్ని వక్రీకరించి ప్రభుత్వంపై దుష్ప్రచారమే ధ్యేయంగా చంద్రబాబు, లోకేశ్ పనిచేస్తున్నారని మంత్రి విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: