ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాజకీయ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. ఆయన స్వయంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ చిన్నల్లుడు. ఎన్టీఆర్ పార్టీ పెట్టేనాటికి చంద్రబాబు కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ ను వదలి తెలుగు దేశం పార్టీలో చేరారు. అయితే అప్పట్లో చంద్రబాబు తెలుగు దేశంలో చేరడాన్ని అప్పటి తెలుగు దేశం నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. వారిలో అప్పటి రెవెన్యూ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఒకరు.

చంద్రబాబు తెలుగు దేశంలోకి రావడంతో పాటే పరిస్థితులను క్రమంగా తన అదుపులోకి తెచ్చుకున్నాడని చెబుతారు. అందులో భాగంగానే అప్పట్లో కొందరు మంత్రులను ఎన్టీఆర్ బర్తరఫ్ చేశారు. వారిలో రెవెన్యూ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఒకరు. ఆ తర్వాత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. దానికి సంబంధించిన ఆంధ్ర పత్రిక క్లిప్పింగ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సీఎం పదవి కోసం చంద్రబాబు ఏం చేసేందుకైనా వెనుకాడడు అంటూ 1987లోనే నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు తెలుగు దేశంలోకి వచ్చాక ముందు పర్వతనేని ఉపేంద్రను అడ్డుతొలగించుకున్నారని.. ఆ తర్వాత సీనియర్లపై చాడీలు చెప్పి వారిని పార్టీ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నారని.. ఇలా చేస్తున్న చంద్రబాబు అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి కుర్చీయేనని నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి అప్పట్లో అన్నట్టు ఈ క్లిప్పింగ్ చెబుతోంది.

ఇప్పటికే చంద్రబాబు తనను తొలగించేలా చేశాడని.. ఉపేంద్ర అడ్డు తొలగించుకున్నాడని.. ఇక మిగిలింది ఎన్టీఆర్ ప్రాణమేనంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏదో ఒక రోజు ఎన్టీఆర్ కు అన్నంలో విషం కలిపి చంపినా చంపుతాడని నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి విమర్శించారు. అయితే ఆ నాటి పాత క్లిప్ ఇప్పుడు వైరల్ అవడం విశేషం. చంద్రబాబు వ్యతిరేక వర్గాలు ఇలాంటి వాటిని అప్పుడప్పుడు వెలికి తీసి వైరల్ చేస్తుంటాయి. ఇది కూడా అందులో భాగమే కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: