రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ప్రజలను ఈ మహమ్మారి నుండి కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేసింది. ఇక లాక్‌డౌన్‌ను కఠినంగానే అమలు చేయాలని పోలీసులకు సూచించింది. దీంతో లాక్‌డౌన్ అమలుకు సంబంధించి పోలీసులు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అయితే కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసు వేసుకోవాలనుకునే వారికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చే అంశంపై పోలీసులకు డీజీపీ కీలక సూచనలు చేశారు. కరోనా వాక్సినేషన్‌కు వెళ్తున్న వారు మొదటి డోస్‌కు సంబంధించిన సమాచారం ఫోన్‌లో చూసి వారికి సడలింపు ఇవ్వాలని తెలిపారు. హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా ప్రధాన కేంద్రాలు, ప్రధాన నగరాల్లో పటిష్టంగా అమలు చేయాలన్న డీజీపీ వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణాలపై ఏ విధమైన ఆంక్షలు లేవని పోలీసులకు తెలిపారు.

ఇక జాతీయ రహదారులపై రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవని వెల్లడించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ అక్రిడేషన్లు కానీ, పత్రికాపరమైన గుర్తింపుకార్డులు తమవెంట ఉంచుకోవాలని డీజీపీ సూచించారు. గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత, ఉపాధి హామీ పనులను లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు గుర్తుచేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు గుర్తింపు కార్డులుంటే సరిపోతుందని, రాష్ట్రంలో జరిగే వివాహాలకు ఇరువైపులా 40 మంది మాత్రమే హాజరవ్వాలని సూచించారు.

అయితే వివాహలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులను జారీ చేయాలని ఆదేశించారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టంతో పాటు ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: