తెలంగాణ ప్ర‌భుత్వం అక‌స్మాత్తుగా లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో తెలంగాణ జిల్లాల‌తోపాటు ఆంధ్ర‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర ప్రాంతానికి చెందిన ప్ర‌జ‌లంతా ఒక్క‌సారిగా రైల్వేస్టేష‌న్లు, బ‌స్టాండ్ల‌కు పోటెత్తారు. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంలో భాగంగా ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లంతా ప్ర‌యాణాలు పెట్టుకోవ‌డంతో ప్ర‌యాణ ప్రాంగ‌ణాల‌న్నీ మ‌రోసారి క‌రోనా హాట్‌స్పాట్లుగా మారాయ‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌భుత్వం క‌నీసం ఒక‌రోజ‌న్నా ముంద‌స్తు స‌మాచారం లేకుండా ప్ర‌క‌టించ‌డంపై హైకోర్టు చీవాట్లు పెట్టింది. కొవిడ్ క‌ట్ట‌డికి స‌రైన చ‌ర్య‌లు తీసుకోవ‌డంలేదని, మ‌త ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల కోసం ప్ర‌జ‌లు గుమిగూడేలా ప్ర‌భుత్వ‌మే వ్య‌వ‌హ‌రిస్తోందంటూ ఇప్ప‌టికే హైకోర్టు ఆక్షేపించిన సంగ‌తి తెలిసిందే.

లాక్‌డౌన్ పొడిగింపు ఉంటుంద‌నే భావ‌న‌తో...
హైద‌రాబాద్ నుంచి తెలంగాణ జిల్లాల‌కి వెళ్లాల్సిన‌వారు ఎల్‌బీన‌గ‌ర్‌, దిల్‌షుక్‌న‌గ‌ర్‌, ఉప్ప‌ల్‌, జూబ్లీ బ‌స్టాండ్ల‌కు పోటెత్తారు. ఆంధ్ర, క‌ర్ణాట‌క వెళ్లాల్సిన‌వారు రైల్వేల‌ను ఆశ్ర‌యించారు. రైళ్ల‌న్నీ ఖాళీగా ఉండ‌టంతో టిక్కెట్ల‌న్నీ సుల‌భంగానే దొరికాయి. బుధ‌వారం నుంచి ప్ర‌యాణం చేయ‌డం క‌ష్ట‌మ‌నే భావ‌న‌తో అప్ప‌టిక‌ప్పుడే బ‌ట్ట‌లు స‌ర్దుకొని బ‌య‌లుదేరారు. త‌ర్వాత కూడా మ‌ళ్లీ లాక్‌డౌన్ పొడిగింపు ఉంటుంద‌నే భావ‌న‌లో ఉండ‌టంతో ప్ర‌జ‌లంతా సాయంత్రం నుంచే ప్ర‌యాణాలు పెట్టుకున్నారు.

ప్ర‌యాణికుల కోసం బ‌స్సులు... బ‌స్సుల కోసం ప్ర‌యాణికులు
లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న రాక‌ముందు వ‌ర‌కు న‌గ‌రంలో తిరిగే బ‌స్సుల‌తోపాటు దూర‌ప్రాంత బ‌స్సుల‌న్నీ ఖాళీగా తిరిగాయి. అప్ప‌టివ‌ర‌కు ప్ర‌యాణికుల కోసం బ‌స్సులు ఎదురుచూడ‌గా.. ఆ త‌ర్వాత బ‌స్సుల కోసం ప్ర‌యాణికులు ఎదురుచూశారు. పెరిగిన ర‌ద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ఉన్న‌తాధికారులు బ‌స్సు స‌ర్వీసుల‌ను ఏర్పాటు చేయ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. సాయంత్రం నాలుగు గంట‌ల‌కు మొద‌లైన ర‌ద్దీ రాత్రి ప‌దిగంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. కొవిడ్‌వ్యాప్తి ఉధృతంగా ఉన్న‌వేళ దానిని నియంత్రించ‌డానికే లాక్‌డౌన్ విధిస్తార‌ని, కానీ తెలంగాణ ప్ర‌భుత్వం ముంద‌స్తుగా ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోకుండా, ప్ర‌జ‌లంద‌రినీ అప్ర‌మ‌త్తం చేయ‌కుండా ఇష్ట‌మొచ్చిన‌రీతిలో ప్ర‌క‌ట‌న చేయ‌డంతో రోజువారీ కూలీల నుంచి ఉద్యోగ‌స్తుల వ‌ర‌కు అంద‌రూ సొంతూళ్ల‌కు వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించారు. ఒక్క‌సారిగా ర‌ద్దీ పెరిగిపోవ‌డంతో క‌రోనా వ్యాపిస్తుందేమోన‌న్న ఆందోళ‌న వైద్య‌వ‌ర్గాల నుంచి వ్య‌క్త‌మైంది. బాధ్య‌తారాహిత్య‌మైన ప్ర‌క‌ట‌న అంటూ ప్ర‌తిప‌క్షాలు తెలంగాణ ప్ర‌భుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: