చంద్రబాబును అందుకేఅపర చాణక్యుడు అనేది. బాబు రాజకీయాలే ఊపిరిగా జీవిస్తారు అని అంటారు. ఆయనలా పాలిటిక్స్ ని రోజులో ఇరవై నాలుగు గంటలూ ప్రేమించే వారు లేరు. బాబు మాదిరిగా రాజకీయమే జీవితంగా మార్చుకునే వారు కూడా ఎవరూ లేరు, ఇక పైన రారు కూడా.

ఇదంతా ఎందుకంటే చంద్రబాబు వరస ఎన్నికల్లో ఓడిపోతున్నా కూడా తన తడాఖా చూపిస్తున్నారు. అంతే కాదు, 151 ఎమ్మెల్యే సీట్లు, అప్రతిహత మెజారిటీతో ఉన్న వైసీపీకి ఆయన ఎపుడూ వెన్నులో  వణుకు పుట్టిస్తూనే ఉన్నారు. కరోనా రెండవ దశలో కూడా చంద్రబాబు వైసీపీ ఏలికలను తెగ డిస్టర్బ్ చేస్తున్నారు. చంద్రబాబు ఉన్నది పొరుగు రాష్ట్రంలో. ఆయన ప్రవాసాంధ్రుడు. ఈ మాటలు అన్నది కూడా వైసీపీ నేతలే. మరి బాబు విషయాన్ని ఎందుకు పట్టించుకుంటున్నారు.

తాజాగా జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడా గతం కంటే ఎక్కువ మెజారిటీని సాధించుకుని వైసీపీ కాలర్ ఎగరేసింది. అయినా కూడా బాబు నామస్మరణను వైసీపీ వీడలేకపోతోంది. చంద్రబాబు ఏదో ఎన్ 440 కె వైరస్ ఏపీలో ఉందని అన్నారట. దానికి తెగ గిచ్చుకుని ఆయన పైన కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ జనాలకు వివరణ ఇవ్వాలి అనుకుంటే సంబంధిత  బాధ్యులు ఒక స్టేట్మెంట్ ఇచ్చి జనాలకు అసలు విషయం చెప్పవచ్చు.

అంతే తప్ప చంద్రబాబు మీద వరసపెట్టి కేసులు పెట్టి ఆయన్ని హీరోను చేయడం ఎందుకు. తిరుపతి ఎన్నికల తరువాత తన ఓట్లను ఆరు శాతం తగ్గించుకుని చంద్రబాబు బాగా డీలా పడ్డారు. ఇపుడు ఆయన పార్టీని జనంలో చర్చకు పెట్టడం అవసరమా. పాండమిక్ సిట్యువేషన్ లో జనాలకు సేవ చేయడం ముఖ్యమా. ఏది ఏమైనా వైసీపీ వెళ్తున్న రూట్ చూస్తూంటే బాబు కు మళ్ళీ గుడ్ డేస్ వస్తున్నాయా అన్న డౌట్లు మాత్రం కలుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: