దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎదోఒక్క రూపంలో కరోనా సోకుతూనే ఉంది. ఇక ఇంట్లోనే కూర్చొని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కరోనా వైరస్ సోకుతూనే ఉంది. అలాంటిది గుంపుగా ప్రదేశంలోకి వెళ్తే.. కరోనా రాకుండా ఎలా ఉంటుంది. స్వయంగా మనమే ఆ మహమ్మారిని ఆహ్వానించినట్టు ఉంటుంది. కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉంటారని అనుకుంటే పొరపాటే. ప్రజలందు మందుబాబులు వేరు.

ఇక ఇప్పటికే కరోనాను అరికట్టేందుకు పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా తెలంగాణ సర్కార్ ఇలా లాక్ డౌన్ ప్రకటించిందో లేదో అలా వైన్ షాపులు కిటకిటలాడాయి. ఇక కనీసం మాస్క్ పెట్టుకున్నామా లేదా అనే విషయం మరిచి మరీ మందుబాబులు క్యూ కట్టారు. ఇక భౌతికదూరం అంటారా.. వీళ్ల దృష్టిలో అదంతా ఓ వ్యర్థ ప్రేలాపణ. క్యూ లైన్లో రాసుకోవడం, పూసుకోవడం, తోసుకోవడం, తొక్కుకోవడం ఇలాంటి అన్ని సహజమే.

ఇక హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని దాదాపు అన్ని ప్రధాన పట్టణాల్లో వైన్ షాపుల ముందు మందు బాబులు క్యూ కట్టారు. ప్రభుత్వం ఇలా లాక్ డౌన్ ప్రకటించిందో లేదో అలా మత్తు వదిలించుకొని మరీ పరుగులుపెట్టారు. హైదరాబాద్ పటాన్ చెరు హైవేపై ఉన్న ఓ వైన్ షాపు వద్ద కిలోమీటరు మేర మందు బాబులు క్యూ కట్టారు. మండే ఎండని సైతం లెక్కచేయకుండా చుక్క కోసం క్రమశిక్షణగా క్యూ లైన్లో నిల్చున్నారు.

అయితే వైన్ షాపుల ముందు మద్యం ప్రియులు ఇలా క్యూ కట్టడానికి మరో రీజన్ ఉంది. లెక్కప్రకారం తెలంగాణలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు షాపులు తెరిచే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. అయితే బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులు ఆ టైమ్ లో తెరిచే అవకాశం లేదని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అధికారులు అంటున్నారు. దీంతో ఎందుకైనా మంచిదని మందుబాబులు ఇలా వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. ప్రాణాలకు తెగించి మద్యం కొనుగోలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: