దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. ఆయా రాష్ట్రాలలో వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళ నాడు, వంటి రాష్ట్రాలలో ఈ మహమ్మారి ప్రభావం అధికంగా ఉండడంతో ఆ రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ విధించి కరోనా కు అడ్డుకట్ట వేసేందుకు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కోవిడ్ తీవ్రత అధికంగానే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు కే‌సి‌ఆర్ సర్కార్ తాజాగా జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా నేటి నుండి ( మే 12 ) లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.

 అయితే కే‌సి‌ఆర్ సర్కార్ ఉన్నఫలంగా లాక్ డౌన్ విధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు లాక్ డౌన్ ను సమర్థిస్తుండగా మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గత ఏడాది కరోనా కారణంగా సంపూర్ణ లాక్ డౌన్ విధించడంతో ఏ స్థాయిలో నష్టం జరిగిందో అందరికీ తెలిసిందే. ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పలు రంగాలపై ఆధారపడి జీవనం కొనసాగించిన వారి పరిస్థితి ఎంతో దయనీయంగా మారిన సంఘటనను ప్రజలు అంత తేలికగా ర్చి పోలేరు. ఇక వలసదారుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. లాక్ డౌన్ తో వారి స్వస్థలాలకు తిరిగి వెళ్ళడం.. సరిహద్దుల దగ్గర నిద్రా హారాలు మాని పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. 

దాంతో మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో హటాత్తుగా లాక్ డౌన్ విధించడంతో సి‌ఎం ఆలోచనా విధానంను కొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు. గత ఏడాది లాక్ డౌన్ వల్ల ఎదుర్కొన్న సమస్యలను సి‌ఎం కే‌సి‌ఆర్ కళ్ళారా చూసి కూడా ఏమాత్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా లాక్ డౌన్ విధించడం సమంజసం కాదని విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ విధిస్తే తలెత్తే సమస్యలపై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి, లాక్ డౌన్ విధించే కచ్చితమైన సమయాన్ని ప్రజలకు ముందుగానే తెలిపి ఆ తరువాత లాక్ డౌన్ విధించి ఉంటే లాక్ డౌన్ వల్ల జరిగే నష్టాన్ని కొంతైనా తగ్గించే అవకాశం ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి నేటి నుండి తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.   .

మరింత సమాచారం తెలుసుకోండి: