తెలుగుదేశం, కాంగ్రెస్, సీపీఐ పార్టీల సంయుక్త ప్రకటన చేసాయి. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరణించినవారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అని పార్టీలు పేర్కొన్నాయి. వైసీపీ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యానికి ఏపీ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది అని మూడు పార్టీలు మండిపడ్డాయి. కరోనా ధాటికి పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అని విమర్శలు చేసారు.

 ప్రపంచమంతా కరోనాపై పోరులో అవిశ్రాంతంగా శ్రమిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి కక్షసాధింపు చర్యలతో తన సమయాన్నంతా వృథా చేస్తున్నారు అని మండిపడ్డారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక సుమారు 25 మంది చనిపోతే ప్రభుత్వం లెక్కలేనితనంగా వ్యవహరిస్తోంది అని విమర్శలు చేసారు. చెన్నై నుంచి ఆక్సిజన్ రావడం లేటు కావడం వల్లే ఘటన జరిగిందని తప్పించుకునే ప్రయత్నం చేయడం వైసీపీ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం అని విమర్శలు చేసారు.

తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల యొక్క సలహాలు, సూచనలు స్వీకరించి, లోటుపాట్లను సరిదిద్ది రోజురోజుకు దిగజారుతున్నటువంటి కొవిడ్ పరిస్థితిని చక్కదిద్దాలి అని సూచించారు. 18 నుంచి 45 సంవత్సరాల వారితో పాటుగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సత్వరమే ఉచిత వ్యాక్సన్ అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని కోరారు. అందుకు అనుగుణంగా నిధులు విడుదల చేసి నేరుగా వ్యాక్సిన్ కంపెనీలు నుంచి టీకా కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేసారు.

అంతేకాకుండా వ్యాక్సిన్ ను విదేశీ కంపెనీల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం కేంద్రం కల్పించిన క్రమంలో గ్లోబల్ టెండర్ల ద్వారా వ్యాక్సిన్ కొనుగోలు చేసి తక్షణమే అందుబాటులోకి తేవాలి అని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటికీ తగినంత ఆక్సిజన్ సరఫరా చేయాలి అని విజ్ఞప్తి చేసారు. లోటుపాట్లు సవరించి ఆక్సిజన్ సరఫరాను క్రమబద్దీకరించాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: