ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వ‌ద్ద ప్ర‌స్తుతానికి సొమ్ములు లేవ‌ని అంద‌రూ ఒక నిశ్చితాభిప్రాయానికి వ‌చ్చారు. టీకాలు కొనుగోలు చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ కంపెనీలు ముంద‌స్తు డిపాజిట్ కింద సొమ్ములు క‌ట్ట‌మ‌న‌డంతో ఇంత‌వ‌ర‌కు ఏమీ మాట్లాడ‌లేని స్థితిలోకి ప్ర‌భుత్వం జారిపోయింద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. టీకాలు కొనుగోలుకే సొమ్ములు లేన‌ప్పుడు ప్ర‌జ‌ల ప్రాణాలు ఎలా కాపాడుతుంద‌నే సందేహం అంద‌రిలోను వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో చేతిలో డ‌బ్బులుంటేనే ఏదైనా చేయ‌వ‌చ్చు అనేది మ‌నిషికే కాకుండా ప్ర‌భుత్వానికి కూడా వ‌ర్తిస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది. అన్నీ డ‌బ్బుల‌తోనే ముడిప‌డివున్నాయి కాబ‌ట్టి.. క‌రోనా విప‌త్తువేళ ఏపీ ప్ర‌భుత్వం కూడా ఆదాయం ఆర్జించ‌డంపై దృష్టిసారించింది.

ఎన్ని సీసాలు కావాలంటే.. అన్ని సీసాలివ్వండి!
ఆదాయార్జ‌న‌లో భాగంగా మ‌ద్యం అమ్మ‌కాలు పెంచాలంటూ ప్ర‌భుత్వం ఆదేశాలిచ్చింద‌ని న‌ర‌సాపురం వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఆరోపిస్తున్నారు. ఈ ఆదేశాల్లో భాగంగానే ఏలూరులోని మ‌ద్యం దుకాణాల్లో ఎన్ని సీసాలు కావాలంటే అన్ని సీసాలు అమ్ముతున్నార‌ని, ఇంత‌వ‌ర‌కు ఒక మ‌నిషికి మూడు సీసాలే ఇచ్చేవార‌ని.. ఇప్పుడు ప‌రిమితి లేకుండా అమ్మండంటూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేయ‌డంతో విచ్చ‌ల‌విడి అమ్మ‌కాలు సాగుతున్నాయ‌ని ఎంపీ రఘురామ చెబుతున్నారు. మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల‌కు క‌ర్ఫ్యూ ప్రారంభ‌మ‌వ‌డంకూడా బెల్టుషాపు నిర్వాహ‌కులకు వ‌రంగా మారిందంటున్నారు. ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాలు మూసేసిన త‌ర్వాత బెల్టుషాపుల‌వ‌ద్ద అమ్మ‌కాలు జోరందుకుంటున్నాయ‌ని, డిపో అధికారులు కూడా చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో ప్ర‌భుత్వం నిర్ధేశించిన ల‌క్ష్యం మేర‌కే ఆదాయం వ‌స్తోంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

మెడిక‌ల్ షాపులు, మ‌ద్యం దుకాణాలు ఒక‌టే!
క‌రోనా విజృంభిస్తున్న‌వేళ ప్ర‌జ‌లు ఔష‌ధాల కోసం మెడిక‌ల్ షాపుల ఎదుట క్యూ క‌డుతున్నారు. ఏ షాపు ద‌గ్గ‌ర చూసినా ఇదే ప‌రిస్థితి క‌న‌ప‌డుతోంది. అలాగే మ‌ద్యం దుకాణాల‌వ‌ద్ద కూడా ఇంత‌కుమించి క్యూ క‌న‌ప‌డుతోంది. ఎందుకంటే మెడిక‌ల్ షాపులు 24 గంట‌లు తెరిచివుంటాయి. కానీ ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాలు మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల‌కే మూత‌ప‌డ‌తాయి. అందుకే  మ‌ద్యం దుకాణాల‌వ‌ద్దే ప్ర‌జ‌ల క్యూ ఎక్కువ‌గా ఉంటోందంటే అతిశ‌యోక్తికాదు. సొంత పార్టీ ఎంపీ ఆరోపించిన‌ట్లుగానే ఆదాయం కోసం మ‌ద్యం అమ్మ‌కాలు పెంచుకోవ‌డానికి ఆదేశాలు జారీచేసిందా?  లేదా? అనేది ప్ర‌భుత్వ‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంది.!!



మరింత సమాచారం తెలుసుకోండి: