తెలంగాణలో కరోనాను అంతం చేయడానికి కేసీఆర్ సర్కార్ లాక్ డౌన్ విధించింది. సరిహద్దుల వద్ద కఠిన చర్యలు తీసుకుంటోంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అంబులెన్సులను కూడా రాష్ట్రంలోకి రాకుండా పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల హైకోర్టు కూడా అంబులెన్సులు సరిహద్దులు దాటొచ్చని తెలిపినప్పటికీ పోలీసులు మాత్రం వాటిని లోనికి రానీయడం లేదు. దీంతో సరిహద్దుల్లో అంబులెన్సులు క్యూ కడుతున్నాయి. ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపివేయడం వల్ల బంధువులు గగ్గోలు పెడుతున్నారు. వైద్యం కోసం వెళ్తున్న రోగుల్ని ఎలా అడ్డుకుంటారని హైకోర్టు సీరియస్ అయినా కూడా హైకోర్టు ఆదేశాలను పోలీసులు పట్టించుకోవడం లేదు. వరుసగా రెండవ రోజు కూడా ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లోఅంబులెన్స్‌లను నిలిపివేస్తున్నారు. తెలంగాణ ఆసుపత్రుల్లో బెడ్ ఉన్నట్టు అనుమతి పత్రాలు చూపిస్తేనే వదులుతున్నారు. ప్రస్తుతం నేడు రెండవ రోజు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

అనుమతి పత్రాలతో పాటు సంబంధిత ఆసుపత్రి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్‌లో తమతో మాట్లాడిస్తేనే వదులుతున్నారని రోగి బంధువులు ఆందోళన చెందుతున్నారు. కొందరికైతే వెంటనే ఫోన్‌లు రావడంతో వదులుతున్నారు. మరికొందరికి ఫోన్ రావడం ఆలస్యమవుతోంది. దాంతో పోలీసులు, రోగి బంధువులు వాగ్వాదానికి దిగుతున్నారు. కొందరికైతే గంటల తరబడీ సరిహద్దుల్లోనే నిలిపేస్తున్నారు. ప్రయాణ సమయాన్ని అంచనా వేసుకుని సరిపడేంత ఆక్సిజన్ నింపుకుని వస్తున్న రోగులకు ఇది శాపంగా మారుతోంది. ఒక వేళ ఆక్సిజన్ అయిపోతే వారి పరిస్థితి ఏంటని మరికొందరు వాదిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద ఇదే పరిస్థితి ఎదురైంది. అటు వాడపల్లి కృష్ణానది వంతెన చెక్ పోస్టు వద్ద కూడా ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను నిలిపివేస్తున్నారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో చేరేందుకు ముందస్తు అనుమతి ఉన్న వాహనాల్నే అనుమతించారు. దీంతో కరోనా రోగి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా మారాలని, కరోనా రోగుల కోసం ఆంక్షలను సరిచేయాలని వారు కోరుతున్నారు. దీనిపై సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: