తెలంగాణ రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఈటల సంక్షోభం హాట్ టాపిక్ గా మారింది. ఎవరు ఊహించని విధంగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటలను పార్టీ ఒక్కసారిగా పక్కన పెట్టింది. ఇప్పుడు ఈటల వ్యవహారం తిరిగి పార్టీకి తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా టిఆర్ఎస్ రాజీ రాజకీయం మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. అదేమిటి అంటే ఈటెల రాజేందర్ రాజీ పడటానికి సిద్ధంగా ఉన్నారని టిఆర్ఎస్ హైకమాండ్ కు సమాచారం పంపినట్టు టీఆర్ఎస్ లో ఒక వర్గం ప్రచారం మొదలు పెట్టింది. అదే సమాచారాన్ని కొన్ని పత్రికల చేత ప్రచురింప చేశారు కూడా. 


అది కూడా ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికలో, ఈటల రాజీకి రెడీ అన్నట్టు ఒక పెద్ద కథనం వ్రాయించారు. బలహీనపడిన ఈటల తనకు ఎవరూ మద్దతుగా నిలవడం లేని కారణంగా టీఆర్ఎస్ కు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ కు సందేశం పంపించారు అనేది సదరు వార్త సారాంశం. అయితే ఇది పూర్తిగా నిజం కాదని ఈటల వర్గీయులు చెబుతున్నారు. జరిగిందేదో జరిగిపోయింది ఇకమీదట పక్కాగా ప్లాన్ చేసుకుని తన రాజకీయ ప్రస్థానాన్ని రీస్టార్ట్ చేయాలని ఈటల చాలా పట్టుదలగా ఉన్నాడు అని ఆయన అభిమానులు చెబుతున్నారు. 


అందుకు తగ్గట్లుగానే ఈటల కూడా రోజుకు ఒక నేతను కలుస్తూ చర్చనీయాంశంగా మారుతున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి మొదలు భట్టి విక్రమార్క తాజాగా డి శ్రీనివాస్ లాంటి నేతలతో ఆయన ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే వీరంతా కేసీఆర్ కి వ్యతిరేకులు. ఆ విధంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న అందరిని ఒక తాటి మీదకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈటల వర్గీయుల వాదన. అందుకే టీఆర్ఎస్ ఈ రాజీ రాజకీయం చేస్తోందని కావాలని తమ అనుకూల మీడియా చేత ఇలా లీకులు ఇస్తూ ఉందని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ రాజకీయం ఎంతవరకు టిఆర్ఎస్ కి ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: