ఏపీ రాజకీయాలు వేరే రూట్లో సాగుతున్నాయి. ఆ సంగతి బయట ప్రపంచానికి బాగా అర్ధమవుతోంది. ఇక్కడ ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడమే ఒక అలవాటుగా మారిపోయింది. అదే సమయంలో అనేక కీలకమైన అంశాలు చర్చకు రాకుండా పోతున్నాయి.

అది అసెంబ్లీ అయినా లేక బయట అయినా కూడా అధికార విపక్షాల మధ్య రచ్చ సాగుతూనే ఉంటుంది. ఇదంతా గడచిన పదేళ్ళ కాలం నుంచే సాగుతోంది. ఏపీలో అధికారంలో ఎవరు ఉన్నా విపక్షంలో ఉన్న వారు ఏకి పారేస్తూంటారు. వారు మంచి చేస్తే మెచ్చరు కానీ ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా అసలు క్షమించరు అంతే. నాడు టీడీపీ అధికారంలో ఉన్నపుడు వైసీపీ ఇదే రూట్లో వెళ్లింది.

అయిన దానికీ కానిదానికి విమర్శలు చేస్తూ వచ్చింది. ఇపుడు చిత్రంగా వైసీపీ అదే రకమైన తలనొప్పిని ఎదుర్కొంటోంది. చంద్రబాబు అసలే రాజకీయ గండర గండడు. ఆయన చూస్తూ  ఊరుకుంటారా. చాన్స్ దొరకాలే కానీ చాకిరేవు పెట్టేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ దుమ్ము దులిపేస్తున్నారు. దీంతో ఇప్పటిదాకా మాటకు మాటా బదులు ఇస్తూ వస్తున్న వైసీపీ పెద్దలు ఇపుడు కాస్తా కొత్తగా ఆలోచిస్తున్నారు అనుకోవాలి.

ఈ రాజకీయంలో తాము ఏమి కోల్పోయిందో కూడా నేతలకు బాగా తెలిసి వస్తోంది అంటున్నారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం మాకు కావాలి అన్నది వైసీపీ తాజా స్లోగన్.  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి  అయినా మంత్రి అనిల్ కుమార్ అయినా మరో నేత అయినా కూడా ఇపుడు ఇదే అంటున్నారు. విపక్షం సలహాలు ఇస్తే మేము కాదంటామా అంటున్నారు. అయితే వారు విమర్శలు చేస్తూ రాజకీయం మాత్రమే చేస్తున్నారు అని బాధపడుతున్నారు. మరి నాడు వైసీపీ ఏదైతే చేసిందో మేమూ అదే చేస్తున్నామని టీడీపీ నుంచి ఆన్సర్ వస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో పాలన సజావుగా సాగాలంటే అధికార పక్షంతో పాటు విపక్షం పాత్ర కూడా చాలా అవసరం. అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మరి దాన్ని మరచిపోవడం వల్లనే రాజకీయమే పరమావధి అవుతోంది. చివరికి కరోనా కాలంలోనూ అది ఆగనంటోంది.  మరి ఇకనైనా మార్పు వస్తుందా.


మరింత సమాచారం తెలుసుకోండి: