దేశంలో కొవిడ్ బారిన ప‌డిన బాధితుల‌ను బ్లాక్‌ఫంగ‌స్ వేధిస్తోంది. మ్యూకోర్‌మైకోసిస్‌గా పిలిచే ఈ వ్యాధి బాధితుల‌పై స్వ‌ల్ప‌స్థాయి నుంచి మ‌ధ్య‌స్థాయిలో ప్ర‌భావం చూపుతోంది. పాక్షికంగా చూపు కోల్పోవ‌డం, త‌ల‌నొప్పి, జ్వ‌రం, క‌ళ్ల‌కింద నొప్పులు, శ్వాస‌మార్గం మూసుకుపోయిన‌ట్ల‌వ‌డంలాంటి ల‌క్ష‌ణాలు క‌న‌ప‌డ‌తాయి. ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లున్న‌వారిని, వ్యాధినిరోధ‌క‌శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారిని బ్లాక్‌ఫంగ‌స్ వెంటాడుతోంది. వీరిలో మ‌ర‌ణాలు రేటు 50శాతానికి పైగా న‌మోద‌వుతుండ‌టం ఆందోళ‌న క‌లిగించే ప‌రిణామంగా మారింది. ఢిల్లీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, గుజ‌రాత్ రాష్ట్రాల్లో ఈ త‌ర‌హా కేసులు ఇప్ప‌టికే వెలుగు చూశాయి. తాజాగా మ‌హారాష్ట్ర‌లో రెండువేల‌కు పైగా బ్లాక్‌ఫంగ‌స్ కేసులుండే అవ‌కాశం ఉందంటూ ఆ రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది.

ప్ర‌త్యేకంగా బ్లాక్ ఫంగ‌స్ చికిత్సా కేంద్రాలు..
మ‌హారాష్ట్ర‌లో ఒక‌వైపు క‌రోనా కేసుల‌తో పాటు, మ‌రోవైపు బ్లాక్ ఫంగ‌స్ కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. బ్లాక్ ఫంగ‌స్ కేసుల బాధితులు పెద్ద సంఖ్య‌లో ఆసుప‌త్రుల‌కు వ‌స్తుండ‌టంతో వీరికోసం మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌కు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల‌ను బ్లాక్ ఫంగ‌స్ చికిత్సా కేంద్రాలుగా మార్చారు. దీనికి అందించే వైద్యం ఖ‌రీదైంది కావ‌డంతో వీలైనంత తక్కువ ఖ‌ర్చుతో వైద్యం అందించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌హాత్మా పూలే జ‌న్ ఆరోగ్య యోజ‌న కింద మ‌హారాష్ట్ర పౌరుల‌కు చికిత్స అందిస్తున్న‌ట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి రాజేష్ తోపే వెల్ల‌డించారు. బాధితుల‌కు ఆంఫోటెర్సిన్ బీ ఇంజెక్ష‌న్‌లు అవ‌స‌రమ‌వుతాయ‌నే ఉద్దేశంతో ల‌క్ష ఇంజ‌క్ష‌న్ల కోసం ప్ర‌భుత్వం టెండ‌ర్ల‌ను ఆహ్వానించింది. బ్లాక్ ఫంగ‌స్ ను ముందుగానే గుర్తించి యాంటీ ఫంగ‌ల్ వైద్యం అందిస్తే బాధితుల ప్రాణాలు కాపాడ‌వ‌చ్చ‌ని అమెరికాకు చెందిన సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్‌ (సీడీసీ) సూచించింది. ఇది ఒక‌రి నుంచి మ‌రొక‌రిక వ్యాపించ‌ద‌ని తెలిపింది.

అప్ర‌మ‌త్త‌మైన మ‌హారాష్ట్ర స‌ర్కార్‌
బ్లాక్ ఫంగ‌స్ సోకిన‌వారిలోమ‌ర‌ణాల రేటు 50 శాతానికి పైగా ఉండ‌టంతో మ‌హారాష్ట్ర స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. రెండువేల‌కు పైగా ఉన్న బాధితుల‌కు చికిత్స‌నందించేందుకు మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌కు అనుబంధంగా ఉండే ఆసుప‌త్రుల‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫంగ‌స్ చికిత్స‌కు ఉప‌యోగించే ఇంజ‌క్ష‌న్ల ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌టంతో త‌గ్గించాలంటూ ఫార్మా కంపెనీల‌కు లేఖ రాసింది. ప‌రిస్థితి అంత ఆశాజ‌న‌కంగా ఏమీలేద‌ని, తీవ్ర‌త‌నుబ‌ట్టే నిర్ణ‌యాలు తీసుకుంటున్నామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.









మరింత సమాచారం తెలుసుకోండి: