ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కాటుకు ప్రజలంతా బలవుతుంటే, రాజకీయాలు కూడా మంచి వేడి మీద ఉన్నాయి. నిన్ననే చంద్రబాబు మీద గుంటూరు లో మరో కేసు పెట్టడంతో మళ్ళీ ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇదిలా ఉంటే గత నెలలో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ సంగం డైరీ చైర్మన్ గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ పోలీసులు అవినీతికి పాల్పడ్డారనే కేసులో అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ఆ తరువాత నరేంద్రను 15 రోజులు రిమాండ్ కు పంపగా, రిమాండును రద్దు చేయడానికి వేసిన పిటిషన్ ను హై కోర్ట్ కొట్టివేయడంతో షాక్ తినడం నరేంద్ర వంతయింది.

అయితే మొన్ననే జైల్లో ఉండగానే కరోనా బారిన పడ్డారు. దీనితో నరేంద్రను ఆయుష్ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేర్పించడం జరిగింది. కానీ ఈ అనారోగ్య సమస్యను దృష్టిలో ఉంచుకుని నరేంద్ర తరపు వారు బెయిలు కోసం ప్రయత్నించగా, కోర్ట్ బెయిలు ఇవ్వడం కుదరదని చెప్పడంతో పాటు సరైన వైద్యాన్ని అందించాలని పోలీస్ శాఖను ఆదేశించింది. కాగా రిమాండులో ఉన్న సమయంలో కోర్ట్ చెప్పిన ప్రకారం 4 రోజులు విచారణ చేయవలసి ఉంది. ఆ మధ్యలోనే ఒక్కరోజు విచారణ పూర్తయింది. ఆ తర్వాత కరోనా రావడంతో మిగిలిన 3 రోజుల విచారణ ఆగిపోయింది. ఈ విచారణ నిమిత్తమే బెయిలుకు నిరాకరించారని తెలుస్తోంది.

ధూళిపాళ్ల నరేంద్ర కోరిక మేరకు ఆయుష్ ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనాకు చికిత్స పొందారు. తాజాగా కరోనా టెస్ట్ చేయగా నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. దీనితో మళ్ళీ నరేంద్రను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే డాక్టర్ల సలహా మేరకు నరేంద్రను ఒక వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉంచాల్సింది. దీనికి ఏసీబీ కూడా అంగీకరించి జైలులోనే ప్రత్యేక ఐసొలేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి ఒక వారం రోజులు ఆయనను విచారించే అవకాశం లేదు. ఆ తరువాత విచారణ జరుగుతుందా లేదా ఏమి జరగనుందో తెలియాలంటే కొన్ని రోజుల పాటు వేచి ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: