న్యూఢిల్లీ: దేశంలోని విపత్కర పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి రోజు పెరుగుతున్న కేసులు, విఫలం అవుతున్న ప్రభుత్వం, ప్రాణాలు కోల్పోతున్న అమాయకపు ప్రజలు ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఇవే. దేశంలో ఒకవైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నా ప్రజలందరికీ అందుబాటులోకి రావడం లేదు. దేశ రాజధానిలోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సిన్‌ల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దాంతో రాష్ట్రానికి అదనపు వ్యాక్సిన్ టీకాలు కావాలని ఢిల్లీ ప్రభుత్వం కోరింది.

 ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం భారత్ బయోటెక్‌కు ఆదేశాలు పంపింది. అయితే కేంద్ర అధికారుల ఆదేశాల మేరకు తాము అదనపు డోసులు ఇవ్వలేమని తేల్చి చెప్పిందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. అయితే తమ కంపెనీసై కొన్ని రాష్ట్రాలు చేస్తున్న ఫిర్యాదులు తమను నిరాశపరుస్తున్నాయని, తమ పరిస్థితిని కూడా కాస్త గుర్తెరిగి ఫిర్యాదు చేయాలని భారత్ బయోటెక్ అధికారులు అన్నారు.

 అంతేకాకుండా ఈ నెలలో 18 రాష్ట్రాలకు వ్యాక్సిన్ చిన్నచిన్న షిప్‌మెంట్స్‌లో పంపామని, ప్రస్తుత కోరోనా పరిస్థితుల కారణంగా కేవలం 50 శాతం ఉద్యోగులతోనే సంస్థను నడుపుతున్నామని, ఇప్పటికే వ్యాక్సిన్‌లు అందించేందుకు మా ఉద్యోగులు రేత్రింబవళ్లు కష్టపడుతున్నారని వారు చెప్పారు. అయితే దేశంలో వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు రాష్ట్రాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనీష్ సిసోడియా మాట్లాడారు.

 కేంద్రమే వ్యాక్సిన్‌ సరఫరాను పరోక్షంగా అడ్డుకుంటుందని ఆయన విమర్శించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని కోవాగ్జిన్ డోసులు అయిపోయాయని, దీంతో రాష్ట్రంలో 17 పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 100 వ్యాక్సినేషన్ సెంటర్లు మూతపడ్డాయని ఆయన తెలిపారు. కేంద్రం అన్నాక దేశాన్ని పరిపాలించే ప్రభుత్వంలా వ్యవహరించాలని, తన బాధ్యతలను గుర్తెరిగి నడుచుకోవాలని అన్నారు.

 అంతేకాకుండా ఇకనైనా దేశం నుంచి వ్యాక్సిన్ల ఎగుమతి ఆపివేయాలని అన్నారు. అంతేకాకుండా మూడు నెలల్లో ప్రతి రాష్ట్రం తమ ప్రజలకు వ్యాక్సిన్ అందించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. మరి ఈ విషయంలో కేంద్ర ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: