ముంబై: దేశంలో కరోనా అల్ల కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. అదే తరహాలో మరణాలు సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం విఫల ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభించినప్పటికీ అందరికీ వ్యాక్సిన్ అందలేదు. అయితే ప్రస్తుతం దేశమంతటా వ్యాక్సిన్ కొరత ఉంది. వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి తక్కువగా ఉంది. పూర్తి దేశంలో కేవలం రెండు కంపెనీలు మాత్రమే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయి.

 దాంతో పాటుగా ఆక్సిజన్ కొరత సంభవించడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోకి వ్యాక్సిన్ వచ్చాక కూడా ఈ మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 75 సంవత్సరాలు పైబడిన వారికి, దివ్యంగులకు, వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లలేని వారికి ఇంటి వద్దనే వ్యాక్సిన్ అందించాలని బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు అయింది. ఈ మేరకు జరిగిన విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే ఇంటింటికి వెళ్లి వయో వృద్ధులకు టీకాలు వేసి ఉంటే ఇన్ని మరణాలు సంభవించేవి కావని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.


 కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని చేపట్టి ఉండాల్సిందని కోర్టు పేర్కొంది. దేశ ప్రజల జీవితాలు సంకటంలో ఉన్నప్పుడు కేంద్రం సరైన నిర్ణయాలు తీసుకోలేదని, వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లలేకపోయిన వృద్దులకు ఇళ్ళకి వెళ్లి టీకాలు అందించి ఉండాల్సిందని, మరి అటువంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదని కోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా ఇంటింటికి వ్యాక్సిన్ అందించరాదన్న నిర్ణయాన్ని తిరిగి పరిశీలించి కేంద్ర నిర్ణయం తమకు తెలపాలని గత నెల 22న కోర్టు ఆదేశించింది.

 అయితే ఇప్పటికే తాను ఆదేశించి మూడు వారాలు దాటాయని, ఇప్పటికీ కేంద్రం తన నిర్ణయం తెలపలేదని బాంబే హైకోర్టు పేర్కొంది. ఈ విషయంలో కేంద్రం త్వరపడాలని, లేదంటే దేశంలో మరిన్ని అమాయకపు ప్రాణాలు పోతాయని, మే 19 నాటికి కేంద్రం తన అఫిడవిట్ దాఖలు చేయాలని తెలిపింది. తదుపరి విచారణ కూడా అప్పుడే జరుగుతుందని చెప్పింది. మరి ఈ విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: