తెలంగాణలో నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి వచ్చిన విషయం విదితమే. ఉదయం 10 గంటలు తర్వాత ఎవ్వరూ రోడ్లపైకి రాకూడదని చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది ప్రభుత్వం. దీనితో నిర్దేశించిన సమయంలో నిత్యవసర సరుకులను తీసుకుని తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా అలాగే కార్మికులకు, ఉద్యోగులకు ఉపాధికి సమస్యలు తలెత్తకుండా పరిశ్రమలు, పారిశ్రామిక కార్యకలాపాలు కోవిడ్ 19 నిభందనలు అనుసరిస్తూ యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది ప్రభుత్వం. తద్వారా కార్మికులకు మరియు ఉద్యోగులకు కాస్త ఊరట కలిగింది. అయితే ఇంటర్నెట్ సర్వీసు సెంటర్లు, ఐ టీ ఆధారిత
సేవ కార్యకలాపాలు,టెలీకమ్యూనికేషన్స్ వంటివి వీలైనంత తక్కువ సిబ్బందితో నడపాలని అవసరానికి మించి ఎక్కువ మంది స్టాఫ్ తో నడపరాదని సూచించింది.

అదే విధంగా పరిశ్రమ నిర్మాణ పనులను తక్కువ మంది సిబ్బందితో యధావిధిగా జరుపుకోవచ్చని పేర్కొంది. కానీ కార్మికులకు, సిబ్బందికి ప్రతి రోజూ వారి శరీర ఉష్ణోగ్రతను పరీక్షించాలని, మాస్క్, శానిటైజర్ తప్పక వాడేలా చర్యలు తీసుకోవాలని  తెలిపింది. అలాగే వాళ్ళలో ఎవరికైనా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే అలాంటివారిని క్వారంటైన్ లో ఉంచడమే కాకుండా వారి వేతనాలు కూడా ఖచ్చితంగా చెల్లించాలని స్పష్టం చేసింది తెలంగాణ సర్కారు. లాక్ డౌన్ మినహాయింపు సమయం తర్వాత కార్మికులకు కూడా అనుమతి లేదని, కాబట్టి వారికి పరిశ్రమల సమీపంలోనే వసతి ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించింది. ఐ డి కార్డులు కలిగిన కార్మికులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. 500 కు మించి కార్మికులను వినియోగించే పరిశ్రమలు తప్పక సొంత  క్వారంటైన్  కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది.

కరోనా నిబంధనలను తు చ తప్పకుండా పాటించాలని సూచించింది ప్రభుత్వం. ఒకవేళ నియమాలను కనుక ఉల్లంఘించినట్లు అయితే అటువంటి పరిశ్రమలపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి పరిశ్రమల యాజమాన్యాలు ఈ నిబంధనలపై దృష్టి సారించారు. కాగా నిన్న మొదటి రోజు లాక్ డౌన్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: