ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన ఘట్టాలకు కరోనా దెబ్బ పడిపోతోంది. మరీ ముఖ్యంగా ప్రజలంతా ఆ ఇద్దరూ ఎదురు పడితే చాలా ఆసక్తిగా చూస్తారు. వారెలా రియాక్ట్ అవుతారో అని కూడా ఆలోచిస్తారు. ఆ ఇద్దరే ఏపీ రాజకీయాలను నడిపే సారధులు.

ఒకరు అధికార పార్టీ అధినేత జగన్ అయితే మరొకరు విపక్ష నేత చంద్రబాబు. ఈ ఇద్దరూ ఎదురుపడి చాలా కాలం అయింది. ఈ ఇద్దరూ కలుసుకునేది శాసన సభా సమావేశాల్లోనే. అయితే కరోనా కారణంగా చాలా కాలంగా శాసనసభ సమావేశాలు సజావుగా సాగడంలేదు. దాంతో జగన్ బాబు మాటల తూటాలు, సవాళ్ళూ , ప్రతి సవాళ్ళూ అన్న ఆసక్తికరమైన సన్నివేశాలు జనాలు చూసే భాగ్యం లేకుండా పోతోంది.

ఈసారి బడ్జెట్ సమావేశాలను కేవలం ఒకే ఒక రోజు మాత్రమే నిర్వహించాలని జగన్ సర్కార్ ఆలోచన చేసింది. ఈ నెల 20వ తేదీన ఒకే ఒక రోజు సమావేశాన్ని నిర్వహించి బడ్జెట్ పద్దులకు ఆమోదం తెలుపుతారు. అంతకంటే మరో అజెండా కూడా లేకపోవడంతో ఈసారి సమావేశాలకు చంద్రబాబు గైర్ హాజర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటున్నారు.

కరోనా చూస్తే ఒకవైపు చాలా ఎక్కువగా ఉంది. దాంతో ఒక్క రోజు దానికి అక్కడ నుంచి రావడం ఎందుకు అన్న ఆలోచనలో బాబు ఉన్నారని టాక్. దీంతో బడ్జెట్ సమావేశాలకు ప్రధాన  ప్రతిపక్ష నాయకుడు ఈసారి కనిపించరు అన్న ప్రచారం అయితే  ఉంది. అన్నీ బాగుంటే కరోనా బాగా తగ్గితే శీతాకాల సమావేశాలను ప్రభుత్వం నవంబర్ లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. బహుశా అవి ఎక్కువ రోజులు సాగుతాయని అంతా అంటున్నారు. అపుడు చంద్రబాబు అసెంబ్లీకి హాజరు అవుతారు అని తెలుస్తోంది. మొత్తానికి బాబు జగన్ ఎదురు పడకుండానే బడ్జెట్ సెషన్ ముగుస్తుంది అన్న టాక్ అయితే ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: