సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానిలో ఓ రాజకీయ వ్యూహం ఉంటుంది. పార్టీ బలోపేతానికి అవసరాన్ని బట్టి కేసీఆర్ తన వ్యూహాలను అమలు చేస్తూ ఉంటారు. తాజాగా ఈటల రాజేందర్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్.. వైద్య ఆరోగ్య శాఖను తనకు బదలాయించుకున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై శాఖ అధికారులతో కేసీఆర్ నిత్యం సమీక్షలు చేస్తున్నారు. ఈ సమీక్షల్లో హరీష్ రావు సైతం పాల్గొంటున్నాడు. కేసీఆర్ సమీక్ష చేసిన అంశాలపై, చేసిన సూచనలను పకడ్బందీగా అమలయ్యేలా హరీష్ రావు పర్యవేక్షిస్తున్నారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ వివిధ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలంగాణ తరఫున మంత్రి హరీశ్‌రావు ప్రగతి భవన్‌ నుంచి సమావేశానికి హాజరయ్యారు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కరోనా రోగులు చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తుండటంతో పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నామని, ఇది రాష్ట్రానికి తలకుమించిన భారంగా మారిందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సమస్యను దృష్టిలో ఉంచుకొని కరోనా చికిత్సకు ఉపయోగించే పరికరాలు, మందులు, ఆక్సిజన్‌ కోటా పెంచాలన్నారు. ప్ర‌స్తుతం వైద్య ఆరోగ్య‌శాఖ సీఎం కేసీఆర్ చేతిలో ఉంది. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌భుత్వంలో ఆ శాఖే కీల‌కంగా మారింది. ప్ర‌తీనిత్యం శాఖ అధికారుల‌తో స‌మీక్ష‌లు, స‌మావేశాలు చేయాల్సి ఉంటుంది. సీఎం కేసీఆర్‌కు ఆమేర స‌మ‌యం ఉండ‌టం క‌ష్ట‌మే. ఈ క్ర‌మంలో హ‌రీష్‌రావుకు వైద్య ఆరోగ్య‌శాఖ‌ను అప్ప‌గించేందుకు కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

ఈట‌ల మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ అయిన త‌రువాత వైద్య ఆరోగ్య‌శాఖ ఎవ‌రికి ఇస్తార‌న్న చ‌ర్చ జోరుగా సాగింది. ఈట‌ల బీసీ కాబ‌ట్టి తెరాస‌లోని బీసీ, ఎస్సీ ఎమ్మెల్యేకు ఈ శాఖ‌ను క‌ట్ట‌బెడ‌తార‌న్న వాద‌న‌లు వినిపించాయి. సీఎం కేసీఆర్‌సైతం ఆమేర‌కే ఆలోచ‌న‌లు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ప్ర‌స్తుతం కేసీఆర్ త‌న వ్యూహం మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో హ‌రీష్‌రావు అంటే అభిమానం ఉంది. పార్టీలోనూ అధిక‌శాతం మంది నేత‌లు హ‌రీష్‌రావును ఇష్ట‌ప‌డ‌తారు.  హ‌రీష్‌రావుకు ఆరోగ్య‌శాఖ‌ను క‌ట్ట‌బెడితే పెద్ద‌గా విమ‌ర్శ‌లురావ‌న్న భావ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే హ‌రీష్‌రావుకు వైద్య ఆరోగ్య‌శాఖను అప్ప‌గించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెరాస ముఖ్య‌నేత‌ల్లో ప్ర‌చారం సాగుతుంది. మ‌రి కేసీఆర్ నిర్ణ‌యం ఎలా ఉండ‌బోతుందో తెలియాలంటే వేచిచూడాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: