తిరుపతి రుయా అసుపత్రిలో ఆ రోజు జరిగిన విషాదం యావత్తు ఆంధ్ర రాష్ట్రానికి వణుకు పుట్టించింది. కరోనా అంటే భయం ఉంది, కాటేస్తుంది అన్న జడుపు కూడా ఉంది. కానీ ఇలా ఊపిరిని నొక్కేసి ఉసురు తీస్తుందని నరకం చూపిస్తుదని యావత్తు సమాజం చూసింది. ఆ మీదట భారీ షాక్ తో ప్రజానీకం అంతా ఉంది.

నిజానికి ఆ రోజు రుయా ఆసుపత్రిలో ఏం జరిగింది అన్నదే ఇపుడు అందరికీ దొలిచేస్తున్న ప్రశ్న. ఎంతమంది చనిపోయారు అన్నది కూడా నిగ్గు తేలడం లేదు. పొంతన లేని లెక్కలు అధికారుల నుంచి వెలువడ్డాయి. అదే సమయంలో విపక్షాలు మాత్రం పేర్లు, ఆధారాలతో సహా  ఎంత మంది చనిపోయారు అన్నది బయటకు తెచ్చారు. ఇక రుయా ఘాతుకం జరిగిన సమయంతో తన తల్లి వద్ద ఉన్న ఒక యువతి అక్కడ చాలా మంది చనిపోయారని మీడియా సాక్షిగా చెప్పి సంచలనం సృష్టించింది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల కూడా నిరసన వ్యక్తం అవుతోంది.

అసలు ఎందుకు ఇంత సీక్రెట్ అన్న మాట కూడా వినిపిస్తోంది. ఎంతమంది చనిపోయినా వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే సమయంలో జరిగిన దాన్ని వైఫల్యంగా అంగీకరించి భవిష్యత్తులో సరిదిద్దుకోవడానికి కూడా అధికారులు  చర్యలు చేపట్టవచ్చు. అయితే రుయా ఆసుపత్రి మరణాల లెక్కలు  మాత్రం ఇప్పటికీ గందరగోళంగా ఉన్నాయి.  మరి ఎందుకిలా చేస్తున్నారు. ఈ గందరగోళానికి కారకులు ఎవరు. అంతిమంగా ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉందని కూడా అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ అయితే 35 మంది ఆక్సిజన్ అందక ఆ రోజు చనిపోయారు అని లెక్కలతో సహా మొత్తం మ్యాటర్ ని బయటకు తెస్తోంది. సీపీఐ అయితే పాతిక మంది పై దాటే చనిపోయారని అంటోంది. కానీ ప్రమాదం జరిగిన తరువాత జిల్లా అధికారులు మాత్రం 11 మంది కరోనా రోజులు ఆక్సిజన్ అందక చనిపోయారు అని ప్రకటించారు. చూస్తే ఈ నంబర్ల మధ్య చాలా తేడా ఉంది. దాంతో ఎక్కడో ఏదో దాస్తున్నారు అన్నది ప్రచారం జరిగిపోతోంది. మరి దీని మీద న్యాయ పోరాటానికి కూడా విపక్షాలు రెడీ అవుతున్నాయట. మొత్తం మీద రుయా విషాదం ఆగేది కాదు వెంటాడేదే అని అంటున్నారు. ఎక్కడో పారదర్శకత లోపించడం వల్లనే ఇలా జరుగుతోంది అని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: