తెలంగాణ‌లో ఓ ప‌క్క క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతుంటే.. మ‌రోప‌క్క తెరాస‌లో ఈట‌ల వ‌ర్సెస్ అధిష్టానం అన్న‌ట్లు మాట‌ల యుద్ధం సాగుతుంది. త్వ‌ర‌లో ఈట‌ల ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తార‌న్న ఊహాగానాల నేప‌థ్యంలో టీఆర్ ఎస్ అధిష్టానం అప్ర‌మ‌త్త‌మైంది. ఆప‌రేష‌న్ హుజురాబాద్ పేరుతో ఈట‌ల‌కు చెక్‌పెట్టేలా ఆ పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇప్ప‌టికే మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో పాగావేయ‌గా.. త్వ‌ర‌లో కేటీఆర్ సైతం హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నార‌ట‌. హుజురాబాద్‌, జ‌మ్మికుట మున్సిపాలిటీల్లో అభివృద్ధి ప‌నుల‌పై ఫోక‌స్ పెట్టిన‌ట్లు స‌మాచారం.

ఈట‌ల రాజేంద‌ర్‌పై అసైన్డ్ భూములు క‌బ్జాచేశార‌న్న ఆరోప‌ణ‌లు రావ‌డంతో సీఎం కేసీఆర్ విచార‌ణ‌కు ఆదేశించ‌డంతో పాటు కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన విష‌యం విధిత‌మే. దీంతో ఈట‌ల‌సైతం కేసీఆర్‌ను స‌వాల్‌చేస్తూ మాట‌ల‌దాడికి దిగుతున్నారు. త్వ‌ర‌లో కొత్త పార్టీ పెట్ట‌బోతున్న‌ట్లు వార్త‌లుసైతం వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఈట‌ల ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల‌తో భేటీ అవుతుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే డీఎస్‌, భ‌ట్టి విక్ర‌మార్క‌, ఎంపీ అర‌వింద్‌ల‌తో పాటు ప‌లువురితో భేటీ అయ్యి త‌న విధివిధానాల‌పై చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. ఈట‌ల భేటీ అయిన వారిలో కాంగ్రెస్‌, బీజేపీ నేత‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. సీనియ‌ర్ నేత‌లు, అనుచ‌రులు ఇచ్చిన సూచ‌న‌ల మేర‌కు లాక్‌డౌన్ అనంత‌రం ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు ఈట‌ల సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. దీంతో తెరాస అధిష్టానం అల‌ర్ట్ అయింది. ఉపఎన్నిక వ‌స్తే ఈట‌ల‌కు చెక్‌పెట్టేలా ఆప‌రేష‌న్ హుజురాబాద్కు తెర‌లేపిన‌ట్లు స‌మాచారం.

మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఇప్ప‌టికే హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో తిష్ట‌వేశారు. ఈట‌ల‌కు నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టుండ‌టంతో ఉప ఎన్నిక వ‌చ్చే స‌మ‌యానికి ఆయ‌న నుండి తెరాస క్యాడ‌ర్‌ను దూరంచేసేలా ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించారు. ఈట‌ల‌కు అనుచ‌రులుగా ముద్ర‌ప‌డిన వారిని త‌మ‌దైన‌శైలిలో గంగుల పార్టీకి విదేయులుగా ఉండేలా చేస్తున్నారు. తాజా హుజురాబాద్ మున్సిపాలిటీలోని 11మంది కౌన్సిల‌ర్ల‌ను పిలిచి చ‌ర్చ‌లు జ‌రిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, ప్రారంభించాల్సిన ప‌నుల‌పై వారితో మాట్లాడారు. జ‌మ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీల్లో నిధుల వ‌ర‌ద పారించేందుకు తెరాస ప్ర‌భుత్వం సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లో మంత్రి కేటీఆర్ హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో అభివృద్ధిప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కేటీఆర్ హుజురాబాద్‌పై ఇప్ప‌టికే ఫోక‌స్ పెట్టిన‌ట్లు స‌మాచారం. ఈట‌ల‌కు మ‌ద్ద‌తుగా ఉంటున్న‌వారి లిస్ట్ ను త‌యారు చేసి వారికి ఫోన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఫ‌లితంగా ఈట‌ల వెంట ఎవ‌రూ వెళ్ల‌కుండా కేటీఆర్ త‌న‌దైన శైలిలో వ్యూహాత్మ‌కంగా ముందుకెళ్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: