ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయ య‌వ‌నిక‌పై ప్ర‌స్తుతం చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తే భ‌విష్య‌త్తు ఎన్నిక‌ల్లో చ‌తుర్ముఖ పోరు త‌ప్ప‌ద‌నే అభిప్రాయాన్ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు వ్య‌క్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా మూడు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఇప్ప‌టికే వ్యూహాలు ర‌చించుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఏ ఎన్నిక‌ల్లో కూడా ఒంట‌రిగా పోటీచేసి గెలిచిన చ‌రిత్ర లేదు. సీపీఐ ఇప్ప‌టికే టీడీపీతో క‌లిసి ప‌నిచేస్తోంది. ఈ రెండు పార్టీల‌కు కాంగ్రెస్ పార్టీ జ‌త‌కూడుతోందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌వేళ ఆ వార్త‌లు నిజ‌మైతే తెలుగుదేశం, సీపీఐ, కాంగ్రెస్‌తో ఒక కూట‌మి ఏర్పాటైన‌ట్ల‌వుతుంది. మ‌రో క‌మ్యూనిస్టు పార్టీ సీపీఎం మాత్రం ప్ర‌స్తుతానికి ఇత‌ర పార్టీల‌న్నింటికీ స‌మ‌దూరం పాటిస్తోంది.

వైసీపీ ఎవ‌రితోను క‌లిసే అవ‌కాశం లేదు!
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగానే ప‌య‌నిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీచేసింది. ఈసారి ఎన్నిక‌ల‌కు కూడా అలాగే సిద్ధ‌ప‌డుతోంది. 2014 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తిచ్చింది. 2019 ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తాపార్టీతో క‌లిసి పోటీచేసింది. సీపీఐకి స‌హ‌జ మిత్ర‌ప‌క్ష‌మైన సీపీఎం ఒక‌వేళ తెలుగుదేశం, కాంగ్రెస్‌, సీపీఐ కూట‌మితో క‌లిస్తే రాష్ట్రంలో త్రిముఖ పోరు త‌ప్ప‌ద‌నిపిస్తోంది. అది కూడా జ‌న‌సేన బీజేపీతో క‌లిసివుంటేనే. ఒక‌వేళ చంద్ర‌బాబునాయుడు పాచిక పారి జ‌న‌సేన భార‌తీయ జ‌న‌తాపార్టీ నుంచి దూరం జ‌రిగితే ఈ కూట‌మి లాభ‌ప‌డే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. జ‌న‌సేనానిని క‌లుపుకువెళ‌దామ‌నే యోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నారు. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మ‌రోసారి గ‌ద్దెనెక్క‌కూడ‌దు అనే ఏకైక ల‌క్ష్యంగా ఈ పార్టీల‌న్నీ ఉన్నాయి.

జ‌న‌సేన‌కు లాభ‌మా? న‌ష్ట‌మా?
అన్నిపార్టీల‌క‌న్నా జ‌న‌సేన పార్టీయే ఇప్పుడు సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటోంది. తెలుగుదేశం పార్టీవైపు మ‌ళ్లితే సొంతంగా గ‌ద్దెనెక్కే అవ‌కాశం క‌నుచూపు మేర‌లో ఉండ‌దు. టీడీపీని దాటి రెండోస్థానంలోకి రావాల‌ని ఉవ్విళ్లూరుతోన్న జ‌న‌సేన‌కు బీజేపీ మైన‌స్‌గా మారింది. ఆ పార్టీమీద వ్య‌క్త‌మ‌వుతోన్న వ్య‌తిరేక‌త ప‌వ‌న్‌కు న‌ష్టం చేకూరుస్తోంది. తెలుగుదేశం పార్టీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే జ‌న‌సేన‌కు ప్ర‌మాద‌మే. ఆ విష‌యం ప‌వ‌న్‌కు తెలుసు. తెలుగుదేశం, క‌మ్యూనిస్టుల‌తో క‌లిసివెళ‌దామా?  బీజేపీతో క‌లిసివెళ‌దామా? అనే విష‌యమై ప‌వ‌న్ సందిగ్ధంలో ప‌డిపోయారు. బీజేపీకి ప‌వ‌న్ దూరం జ‌రిగితే తెలుగుదేశం, సీపీఐ, కాంగ్రెస్‌, సీపీఎం( ఒక‌వేళ జ‌త‌క‌లిస్తే) ఒక కూట‌మిగా, వైసీపీ, జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య చ‌తుర్ముఖ పోరు త‌ప్ప‌ద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: