ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగల్లో రంజాన్ ఒకటి. ఈ పండుగ మాసమంతా కఠిన ఉపవాసాలు ఉంటూ దైవ ప్రార్దన చేసుకుంటారు. ఈ ఉపవాస సమయంలో పచ్చి మంచినీళ్లైనా ముట్టుకోరు. రోజూ దైవ ప్రార్దన చేసుకుంటూ తమ దీక్షను కొనసాగిస్తారు. ఈ దీక్షను ముస్లింలు 30 రోజులు పాటిస్తారు. అయితే అనుకూలత లేని వారు 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు ఇలా బేసి సంఖ్య రోజులు ఈ దీక్షను చేస్తారు. ఈ దీక్షా సమయంలో రోజుకి 5 పూటల సమాజ్ చదువుతూ ఇతర సమయాల్లో వారి పవిత్ర గ్రంథం ఖురాన్ చదువుతూ గడుపుతారు. ఈ కారణంగా దేవుడిపై భక్తి పెరుగుతుందని వారి నమ్మకం. అంతేకాకుండా కటిక ఉపవాసం చేయడంతో భోజనం పట్ల వ్యామోహం తగ్గుతుందని వారి నమ్మకం. ముస్లింలు తమ దీక్షను నెలవంకను చూసి ప్రారంభిస్తారు. అదేవిధంగా రంజాన్ మాసం చివర్లో ‘ఈద్ ఉల్ ఫితర్’ జరిపి తమ దీక్షను ముగిస్తారు.


ఈద్ సమయంలో ముస్లిం సోదరులంతా మసీదుల్లో జరిగే ఈద్ ప్రార్థనలకు హాజరవుతారు. కొత్త బట్టలు ధరించి మసీద్‌కు వెళతారు. ఇది వారి సంప్రదాయం. అంతేకాకుండా ఖర్జూరం వంటి ఏదైనా తీపిని తిని ఆ తర్వాత తిక్బర్ అనే ఓ చిన్న ప్రార్థన చేస్తారు. ఈ ఈద్ ప్రార్థనలు ప్రారంభం కావడానికి ముందు జకాత్ అల్ ఫితర్ పేరుతో పేదవారికి దానధర్మాలు చేస్తారు.  అంతేకాకుండా నేడు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా తమకు ఆప్తులైన వారితో కలిసి ఇఫ్తార్ విందు చేస్తారు. అందుకోసమనే అనేక దేశాల్లో ఈ పర్వదినాన సెలవు ప్రకటిస్తారు.


ఇదిలా ఉంటే ఈ మాసంలో ఉపవాసం అందరూ ఉండరు. కేవలం ఆరోగ్యవంతులు మాత్రమే ఈ దీక్షను చేస్తారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు, ప్రయాణాలు చేసేవారు ఈ దీక్ష చేయరు. ఈ దీక్షా సమయంలో సూర్యోదయం కన్నా ముందే భోజనం ముగిస్తారు. దీనినే సుహుర్ లేదా సెహ్రి అంటారు. అదే విధంగా సూర్యాస్తమయం తరువాత ఉపవాసం ముగిస్తారు. సూర్యాస్తమయం తరువాత చేసే భోజనాన్ని ఇఫ్తార్ లేదా ఫితూర్ అంటారు. ఈ సమయంలో ముస్లింలు దాన ధర్మాలు చేసేందుకు దైవంతో తమ అనుబంధాన్ని బలపరుచుకోవాలని ప్రయత్నిస్తారు.

 అందులో భాగంగా ప్రతి రోజు నమాజ్ తప్పక చేస్తారు. అయితే పండుగకు 2 రోజుల ముందుగ జాగారం చేస్తారు. అందుకోసం ప్రతి మసీద్‌లో రాత్రి పూట తరావీహ్ ప్రార్థనలు చేస్తారు. ఈ ప్రార్థనలకు కూడా కొందరు హాజరవుతారు. ఈ ప్రార్థనలు కేవలం రంజాన్ మాసంలోనే జరుగుతాయి. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి వచ్చాక రంజాన్ రావడం ఇది రెండో సారి.  ఈసారి కూడా ముస్లిం సోదరులు తమ సాంప్రదాయానికి విభిన్నంగా ఈ పండుగను జరుపుకోవాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: