ఆయన అధికార పార్టీ ఎంపీ. అయినా సరే విపక్షం మొత్తం ఆయనకు మద్దతుగా నిలుస్తోంది. వైసీపీ తరఫున 2019 ఎన్నికలో నర్సాపురం నుంచి లోక్ సభ సభ్యుడిగా గెలిచిన రఘురామ రాజు కొద్ది కాలంలోనే రెబెల్ ఎంపీగా మరిపోయారు. ఆయనకు నాటి నుంచి విపక్షం అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయి.

ఏపీలో జగన్ ని ఎదుర్కొనేందుకు శతకోటి ఉపయాల్లో దీన్ని కూడా ఒకటి చేసుకుని విపక్షం పావులు ఇప్పటిదాకా  చురుకుగా  కదుపుతూ వచ్చింది. ఢిల్లీలో రాజు ప్రతీ రోజు రచ్చబండ మీటింగులు పెడుతూ అధికార పార్టీకి కంటిలో నలుసుగా మారారు. ఇదిలా ఉంటే రాజు వెనక ఉన్న బలం రాజకీయ నాయకులకు  అర్ధమవుతోంది. కానీ మొత్తం ఏపీ జనాలకు అర్ధం కావాలి అన్న ఉద్దేశ్యంతోనే జగన్ పావులు కదిపారు అంటున్నారు.

దాని ఫలితంగా రాజు ని సడెన్ గా అరెస్ట్ చేశారు. ఇలా ఆయన్ని అరెస్ట్ చేశారో లేదో కానీ మొత్తానికి మొత్తం విపక్షం ఒక్కటిగా మారి ఆయన తరఫున మద్దతుగా ముందుకు వచ్చింది. టీడీపీ అయితే ఈ విషయంలో ఒక విధంగా షాక్ తిన్నట్లుగా మాట్లాడుతోంది. ఒక ఎంపీని  ఎలా అరెస్ట్ చేస్తారు. రాజ్యాంగ విరుద్ధమని అంటోంది. ఏకంగా  ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలనేంతగా తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్నారు.

మరో వైపు తెలంగాణా ఏపీ సరిహద్దుల్లో అంబులెన్సులను అడ్డుకుంటే పెద్దగా స్పందించని విపక్షం రాజు విషయంలో మాత్రం పెద్ద నోరు చేసుకోవడం కూడా ఏపీ జనమంతా చూస్తున్నానే అంటున్నారు. టీడీపీ బీజేపీ, జనసేన, సీపీఐ ఇలా అన్ని పార్టీలు ఆయన అరెస్ట్ అక్రమం అని అంటున్నాయి. ప్రజాస్వామ్యంలో ఆయన విమర్శించే అర్హత లేదా అని కూడా ప్రశ్నిస్తున్నాయి. ఒక ఎంపీని ఇలా చేస్తారా అని కూడా నిలదీస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఏపీ విపక్షానికి రాజు కేంద్ర బిందువుగా మారిపోయాడు. మరి తమ ప్రభుత్వం మీదకు ఆయన్ని ఉసిగొలుపుతున్నది ఎవరు అన్నది జనాలకు తెలియాలనే వైసీపీ పెద్దలు ఇలా స్కెచ్ గీసారని అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: