ఆంధ్రులకు ఈ రోజుకు సరైన రాజధాని లేదు. ఆ మాటకు వస్తే రాజధాని విషయంలో చెలరేగుతున్న రాజకీయ చిచ్చు అంతా ఇంతా కాదు. చంద్రబాబు అయిదేళ్ల ఏలుబడిలో అమరావతి రాజధాని గురించి జనాలు విన్నారు. ఇపుడు జగన్ పాలనలో మూడు రాజధానుల గురించి అలాగే వింటున్నారు.

ఇదిలా ఉంటే విభజన చట్టంలో స్పష్టంగా అటు ఆంధ్రాకు, ఇటు తెలంగాణాకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్ల పాటు ఉంటుందని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు 2015లోనే విజయవాడకు వచ్చేసి హైదరాబాద్ మీద హక్కులు వదిలేసుకున్నారు. దాంతో హైదరాబాద్ వెళ్లాలంటే ఎంతో ఇబ్బంది అవుతోంది. కరోనా వేళ విషమ పరిస్థితుల్లో రోగులు ఉంటే ఆ అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకున్నారు. దాని మీద హై కోర్టు తీర్పులో కొంత సర్దుబాటు జరిగింది కానీ ఇలాంటివి ముందు ముందు జరగబోవు అన్న హామీని అయితే ఎవరూ ఇవ్వలేరు.

విభజన చట్టం ప్రకారం పదేళ్లు అంటే ఇంకా మూడేళ్ల కాలం హైదరాబాద్ మీద ఏపీకి హక్కు ఉంది. ఈ విషయాన్ని గట్టిగా చెప్పడంతో ఏపీ రాజకీయ నాయకత్వం దారుణంగా విఫలం అయింది. ఆ మాటకు వస్తే విభజన వేళ చాలా మంది హైదరాబాద్ ని యూనియన్ టెర్రిటరీ చేయమని కోరారు. నాడు కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి అయితే యూటీ గా హైదరాబాద్ ఉండాలని పేర్కొన్నారు. కానీ సమైక్య ఆంధ్రా ఉద్యమం పేరిట చేసిన హడావుడితో యూటీ డిమాండ్ ని అంతా లైట్ తీసుకున్నారు. దాని ఫలితాలనే ఇపుడు చూస్తున్నారు అంటున్నారు.

విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వైద్య సదుపాయాలు అన్నీ కూడా హైదరాబాద్ లోనే పూర్తిగా  కేంద్రీకృతం అయ్యాయి. అలాంటి హైదరాబాద్ నిర్మాణం విషయంలో అటు తెలంగాణా పాటు ఆంధ్రుల పాత్ర కూడా ఉందనే అంతా అంటారు. కానీ అడ్డగోలు విభజన పాపానికి మాత్రం పదమూడు జిల్లాల ఆంధ్రులు హైదరాబాద్ మీద హక్కులు కోల్పోయారు. అదే సమయంలో సినీ రాజకీయ రంగాల పెద్దలు, ఇతర రంగాల నిపుణులు, సంపన్నులు హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. వారెవరూ సాటి ఆంధ్రులకు జరుగుతున్న ఆవేదన మీద కిక్కురుమనరు. ఈ నేపధ్యంలో పేదలు, మధ్యతరగతి అయిన కోట్లాది మంది ఆంధ్రులే హైదరాబాద్ తో బంధం పోయి ఎంతో నష్టపోతున్నారు అని చెప్పకతప్పదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: