వైసీపీ సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఈ కామెంట్ పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది. ఎల్లో మీడియాకు ఎందుకు ఇంత క‌డుపు మంటా ? అని నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటు కావ‌డాన్ని జీర్ణించుకోలేని వ్య‌క్తుల్లో, మీడియా అధిప‌తుల్లో.. ఎల్లో మీడియా అధినేత ఒక‌రు. ద‌మ్మున్న అధినేత‌గా గుర్తింపు కోసం త‌హ‌త‌హ‌లాడే ఆయ‌న‌.. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికిప్పుడు ప‌డిపోతే బాగుండు! అని అనుకునేవారిలో ముందున్నార‌ని.. వైసీపీ నాయ‌కులు గుస‌గుస‌లాడుతుంటారు.


ఇక‌, ఎప్పుడు అవ‌కాశం వ‌స్తే.. అప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు బ‌ద్నాం చేసేందుకు ఈ మీడియా అధిప‌తి వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతుంటార‌ని కూడా విమ‌ర్శ‌లు ఉన్నాయి. తాజాగా.. ఈ మీడియాలో వ‌చ్చిన క‌థనంపై వైసీపీ నాయ‌కులు చిర్రెత్తిపోతున్నారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా క‌రోనా తీవ్ర‌త పెరిగిపోయింది. ఈ క్ర‌మంలో వ్యాక్సిన్ ఒక్క‌టే క‌రోనా నుంచి విముక్తి క‌లిగించే దివ్య ఔష‌ధ‌మ‌ని ప్ర‌తి ఒక్క‌రూ భావిస్తున్నారు. అయితే.. దేశంలో వ్యాక్సిన్ త‌యారు చేసేవి రెండే రెండు కంపెనీలు ఉన్నాయి. దీంతో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి ఆల‌స్య‌మై.. క‌రోనా తీవ్రత పెరిగిపోతోంది.


ఈ నేప‌థ్యంలో ఆ రెండు కోవ్యాక్సిన్‌, కోవిషీల్డ్‌.. వ్యాక్సిన్‌ల ఫార్ములాల‌ను ఇత‌ర కంపెనీల‌కు కూడా ఇస్తే.. భారీ ఎత్తున వ్యాక్సిన్ ఉత్ప‌త్తి పెరుగుతుంద‌ని.. త‌ద్వారా దేశంలో క‌రోనా వ్యాప్తి త‌గ్గుతుంద‌ని.. ఏపీ సీఎం జ‌గ‌న్ కొన్ని రోజుల కింద‌ట ప్ర‌ధానికి లేఖ రాసిన విష‌యం వాస్త‌వం. మ‌రి ఈయ‌న లేఖ‌కే కేంద్రం స్పందించిందో.. లేక కేంద్రానికి ఉన్న స‌ల‌హాదారుల సూచ‌న‌ల మేర‌కు స్పందించిందో తెలియ‌దు కానీ.. ఈ క్ర‌మంలో చ‌ర్య‌లైతే మొద‌లు పెట్టింది. అంటే.. వ్యాక్సిన్ ఉత్ప‌త్తి పెంచేందుకు ఫార్ములాను మిగిలిన కంపెనీల‌కు త్వ‌ర‌లోనే ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.


ఇక‌, ఈ విష‌యాన్ని జ‌గ‌న్ సొంత మీడియాలో అనుకూలంగా ప్ర‌చారం చేసుకున్నారు. సీఎం జ‌గ‌న్ చేసిన సూచ‌న‌ల మేర‌కు కేంద్రం వ్యాక్సిన్ ఉత్ప‌త్తిని పెంచేందుకు ఫార్ములా దానం చేయ‌నుంద‌ని.. పేర్కొన్నారు. అయితే.. ఈ వార్త వ‌చ్చీరావ‌డంతోనే ఎల్లో మీడియా అగ్గిమీద గుగ్గిలం అయిపోయింది. ``దేశ ప్రజలు టీకా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక... ‘కొవాగ్జిన్‌’ టీకాకు మరింత కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తయారీ ఫార్ములాను ఇతర కంపెనీలతో పంచుకునేందుకు భారత్‌ బయోటెక్‌ అంగీకరించిందని... ఈనెల 11న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కేంద్రానికి రాసిన లేఖే దీనికి కారణమని ఆయన సొంత పత్రికలో గొప్పగా చెప్పుకొన్నారు.


అసలు విషయం ఏమిటంటే... కొవాగ్జిన్‌ ఫార్ములాను ఇతర కంపెనీలతో పంచుకునేందుకు గత నెలలోనే ఒప్పందం కుదిరింది. ఈ టీకా టెక్నాలజీని మూడు ప్రభుత్వరంగ సంస్థలకు బదిలీ చేసి వాటి ద్వారా కూడా వ్యాక్సిన్‌ తయారు చేయిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ బయో టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గత నెల 15వ తేదీనే ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. కానీ.. జ‌గ‌న్ మాత్రం సొంత డ‌బ్బా కొట్టుకుంటున్నారు`` అని గాలి తీసే ప్ర‌య‌త్నం చేసింది.


అయితే.. ఇదే లేఖ చంద్ర‌బాబు రాసి ఉంటే.. ఇలానే వార్త‌ను ప్ర‌జెంట్ చేసేవారా ? అని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా.. జ‌గ‌న్‌పై ఇంత క‌డుపు మంట ఎందుకు ? అనినేత‌లు అంటున్నారు. జ‌గ‌న్ త‌న సొంత ప‌త్రిక లో రాసుకుంటే.. ఎల్లో మీడియాకు అస‌లు విమ‌ర్శించాల్సిన అవ‌స‌రం ఏంట‌ని అంటున్నారు. మ‌రి దీనికి ఎలాంటి కౌంట‌ర్ వ‌స్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: