వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారానికి సంబంధించి మంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు చేసారు. రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీగా గెలిచారంటే అది జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్ష అని అన్నారు. జగన్ దయతోను, ఆయన పెట్టిన బిక్షతోనూ ఎంపీగా గెలుపొంది పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కరెక్ట్ కాదు అని ఆమె హితవు పలికారు. మాట్లాడే భాష, తీరు, వ్యవహరించే విధానం ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణం ఒక్కటీ ఆయనకు లేదు అని ఆమె మండిపడ్డారు.

ఎంపీగా గెలిచి రెండేళ్లు కావొస్తున్నా ఆయన ప్రజలకోసం చేసిందేమీ లేదు అని విమర్శించారు.  ప్రజలకు అండగా ఉండాల్సిన ఆయన అన్నీ గాలికొదిలేసి ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు అని ఈ సందర్భంగా ఆరోపణలు చేసారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తాను ఎదో ఒక హీరోలాగా కనిపిస్తానని భ్రమపడి ఒక ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు అని ఆమె మండిపడ్డారు. తెలుగుదేశం వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని ఎక్కడబడితే అక్కడ తన స్థాయిని మరచి ఎలాబడితే అలా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.

రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ను మేమంతా సమర్థిస్తున్నాం అని అన్నారు. ఇటువంటి వ్యక్తుల విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని ఆమె పేర్కొన్నారు. ఈ విషయం ఆయన్ను సమర్థిస్తున్న వాళ్ళు కూడా తెలుసుకోవాలి అని ఆమె సూచించారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ... 22నెలలుగా గెలిచిన దగ్గరనుండి ప్రజలకు, ప్రభుత్వానికి వెన్నుపోటు దారుడిగా,నీచమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి ఎంపీ రఘురామ కృష్ణం రాజు  మిగిలారు అని అన్నారు. ప్రజలు అతనిని అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్ లో పనిచేసే వ్యక్తి రఘురామ కృష్ణం రాజు  అని మండిపడ్డారు. ఎంపీ అరెస్ట్ అనేది చట్టబద్ధమైన అంశం.అతను దేశద్రోహితో సమానం. రాజద్రోహ కేసు నమోదు చేయాలి అని వ్యాఖ్యానించారు. ఇలాంటి సన్నాసిని ఎంపీ గా ఎన్నుకున్నందుకు సిగ్గు పడుతున్నాం అని రెండు ఛానలల్లో పనికిమాలిన డిబేట్లు పెట్టుకుని బ్రతుకుతున్నాడు అని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: