ప్రధాన నరేంద్ర మోడీపై ఇంటాబయటా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కట్టడి విషయంలో మోడీ పూర్తిగా విఫలమయ్యారని.. ఆయన అజ్ఞానం కారణంగానే ప్రస్తుతం దేశం అత్యంత ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రజలు నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే అంతర్జాతీయ మీడియా నోర్లు మూయించలేని బీజేపీ సర్కార్ జాతీయ మీడియా పై కన్నెర్ర చేస్తోందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మోడీ సర్కార్ ని బాగా విమర్శిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్లు, మందుల్లో తీవ్ర కొరత ఏర్పడడంతో విమర్శలన్నీ కూడా మోడీ ప్రభుత్వం పైనే ఎగిసిపడుతున్నాయి.

ఇదిలా ఉండగా ఢిల్లీలో కొందరు మోడీకి వ్యతిరేకంగా చాలా పోస్టర్లు అంటించారు. ఆ పోస్టర్లలో "అయ్యా మోడీ గారు, మా పిల్లలకి ఇవ్వాల్సిన టీకాలను విదేశాలకు ఎందుకు పంపించారు?" అని రాసి ఉంది. దీంతో ఢిల్లీ పోలీసులు మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించిన వారిలో దాదాపు 12 మందిని అరెస్టు చేశారు. పబ్లిక్ ప్రాపర్టీ డిఫెక్షన్ సెక్షన్ తో పాటు సంబంధిత చట్టాల కింద 13 కంటే ఎక్కువ ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. గురువారం రోజు తూర్పు ఢిల్లీలోని కళ్యాణ్‌పురి ప్రాంతంలో ఆరుగురిని అరెస్టు చేశారు. అలాగే ప్రధాని కి వ్యతిరేకంగా ప్రత్యక్షమైన 800కు పైగా పోస్టర్లు, బ్యానర్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఇకపోతే గత కొద్ది రోజులుగా భారతదేశంలో 3 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కాలంలో 4 లక్షల వరకు చేరుకున్న రోజువారీ కరోనా కేసులు.. ప్రస్తుతం గణనీయంగా తగ్గుతూ 3లక్షల చేరువలో నమోదవుతున్నాయి. ఐతే కోవిడ్ టెస్టింగ్స్ చాలా తక్కువగా జరుగుతున్నాయని.. అందువల్ల కరోనా పాజిటివ్ కేసులు కూడా తక్కువగా నమోదు అవుతున్నాయని.. ఎక్కువ టెస్టులు చేస్తే మరిన్ని కేసులు కచ్చితంగా నమోదవుతాయని పలువురు అంటున్నారు. ఐతే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మోడీ విమర్శకులను అరెస్టు చేయడంతో.. మోడీ ప్రభుత్వం కరోనా వ్యాప్తి నియంత్రణలో చూపించాల్సిన పనితనం తమను విమర్శిస్తున్న వారిని అణగదొక్కడానికే చూపిస్తోందని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: